సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీల మీద ట్రోలింగ్ కూడా బాగా పెరిగింది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా ఎంతటివారినైనా ట్రోల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రోలింగ్ సెగ నాగర్జునకి కూడా తగిలింది. గతేడాది బిగ్ బాస్ సీజన్ 2 సమయంలో కంటెస్టంట్ల అభిమానులు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగారు. హోస్ట్ నానిని సైతం విడిచిపెట్టలేదు. దెబ్బకు నాని తదుపరి సీజన్ లను హోస్ట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు.

ఇప్పుడు మూడో సీజన్ కోసం నాగార్జునను తీసుకొచ్చారు. తాజాగా విడుదలైన షో ప్రోమోని బట్టి హోస్ట్ గా నాగ్ వ్యవహరించబోతున్నారనే విషయం కన్ఫర్మ్ అయింది. ఇప్పటివరకు హోస్ట్ గా నాగార్జున ఒక్క షో కూడా చేయకుండానే ఆయనపై ట్రోలింగ్ మొదలైపోయింది. గతంలో 'దేవదాస్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో గురించి నాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

బిగ్ బాస్ షో గురించి తను అడగొద్దని, తాను బ్యాడ్ గా మాట్లాడతానని అన్నారు. తనకు బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చదని, అవతలి వ్యక్తి ఏం చేస్తున్నాడో  చూడడం లాంటి విషయాలు తనకు నచ్చవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను పట్టుకొని నాగ్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 

తనకు నచ్చదని చెప్పి ఇప్పుడు డబ్బుల కోసం హోస్ట్ చేస్తున్నాడని కొందరు నాగ్ ని విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం బిగ్ బాస్ పై అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని.. హోస్ట్ చేయడమనేది వృత్తిపరమైన నిర్ణయమని అన్నారు. జూలై చివరి వారంలో ఈ షో మొదలుకానుంది. కంటెస్టంట్ లుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.  త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.