యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. అంటే మరో ఏడాది వరకు ఎన్టీఆర్ డేట్స్ ఖాళీగా ఉండవు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి నుంచి ప్లానింగ్ మొదలుపెట్టేశాడు. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల త్రివిక్రమ్ వినిపించిన స్టోరీ లైన్ కు ఎన్టీఆర్ ఇంప్రెస్ అయ్యాడట. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

మరో విశేషం ఏంటంటే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కాబోతున్నట్లు తెలుస్తోంది. చినబాబు, కళ్యాణ్ రామ్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గత ఏడాది వచ్చిన అరవింద సమేత చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.