జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పరాజయం చెందినా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కేంద్రంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారనే ప్రచారం కూడా ఎన్నికల తర్వాత జోరుగా సాగింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. తన అన్నయ్య కోసం సైరా చిత్రానికి పవన్ వాయిస్ ఓవర్ అందించారు. 

త్వరలో విడుదల కాబోయే సైరా చిత్ర టీజర్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా పవన్ మరో చిత్రానికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ మంచి మిత్రులు. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీతో అల.. వైకుంఠపురములో.. అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి పవన్ చేత వాయిస్ ఓవర్ చెప్పించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

పవన్ సైరాకి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో కొందరు పుకార్లు రాయుళ్లు ఈ వార్తని సృష్టించారని పవన్ అభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు.