టీవి ఛానెల్స్ పెరిగిపోయాక..వాటి మధ్య పోటీ కూడా అదే స్దాయిలో పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో టీఆర్పీల కోసం వాళ్లు తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. సినిమాలు వంటి కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయిన బిజినెస్ లపై కూడా చాలా సార్లు ఆ నిర్ణయాల ప్రభావం పడి దెబ్బ కొడుతున్నాయి. ఇప్పుడు అలాంటి సమస్యే త్రిష తాజా చిత్రానికి ఎదురైంది. దాంతో ఆమె టీవీ ఛానెల్ ని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే..

విజయ్ సేతుపతి ,   త్రిష జంటగా నటించిన త‌మిళ చిత్రం ’96’. తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న విడుద‌ల అయ్యి సూపర్ హిట్ అయ్యి ఇంకా హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది.  అయితే దీపావళి కానుకగా ఈ చిత్ర ప్రీమియర్‌ను  ప్రదర్శించబోతున్నట్లు ఆ చిత్ర శాటిలైట్స్ తీసుకున్న ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్ తెలిపింది. ఈ విషయంపై బాధను వ్యక్తపరిచిన త్రిష తన చిత్రాన్ని అప్పుడే ప్రదర్శించొద్దంటూ రిక్వెస్ట్ చేసింది. 

త్రిష పోస్ట్  చేస్తూ..‘‘మా చిత్రం వచ్చి ఇది ఐదో వారం. ఇప్పటికే థియేటర్లలో 80%ఫుల్‌గా మా చిత్రం నడుస్తోంది. అయితే ఈ చిత్ర ప్రీమియర్‌ను ఇంత త్వరగా బుల్లితెరపై ప్రసారం చేయడం మమ్మల్ని బాధిస్తోంది. ఈ చిత్ర ప్రీమియర్‌ను సంక్రాంతికి వాయిదా వేయాలని మేము అభ్యర్థిస్తున్నాం’’అంది.  మరి త్రిష రిక్వెస్ట్ ను సన్ టీవీ ఏ మేరకు ఓకే చేస్తుందో చూడాలి.

ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ఫోటోగ్రాఫ‌ర్‌గా క‌నిపించ‌గా, త్రిష స్కూల్ టీచ‌ర్ పాత్ర పోషించింది.  పదో తరగతిలోనే ప్రేమలోపడ్డ రామ్‌(విజయ్‌), జాను (త్రిష)ల ప్రేమకథ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ఎంద‌రో సెల‌బ్రిటీల నుండి అభినంద‌న‌లు అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దిల్ రాజు ఇప్ప‌టికే ఈ చిత్ర రైట్స్ తీసుకున్నారు.