టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత అకాల మరణం పొందారు. నిర్మాత కొరటాల సందీప్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని తెలుస్తుంది. ఆదివారం ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కూలిపోయారట. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారని సమాచారం. 


కొరటాల సందీప్ మరణవార్త పలువురు టాలీవుడ్ ప్రముఖులను విషాదంలో నింపివేసింది. ఆయన మరణానికి దిగ్బ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. నిన్న కొరటాల సందీప్ స్వగ్రామం గుంటూరు జిల్లా, బాపట్ల మండలం పూండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు.  

కొరటాల సందీప్ నిఖిల్ హీరోగా రెండు చిత్రాలు చేశారు. వీడు తేడా, స్వామి రారా చిత్రాలకు ఆయన నిర్మాతగా ఉన్నారు. స్వామిరారా సూపర్ హిట్ కావడంతో పాటు నిఖిల్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. అలాగే నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన రౌడీ ఫెలో చిత్రాన్ని కూడా సందీప్ నిర్మించారు.