కరోనా వైరస్‌ మరో తెలుగు దర్శకుడిని బలి తీసుకుంది. ఇటీవల శ్రీవిష్ణుతో `మా అబ్బాయి` సినిమా తీసిన కుమార్ వట్టి కన్నుమూశారు. ఇప్పుడు మరో యంగ్‌ డైరెక్టర్‌ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. వరుణ్‌ సందేశ్‌తో `ప్రియుడు` సినిమాని రూపొందించిన దర్శకుడు శ్రవణ్‌ కన్నుమూశారు. ఆయన ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయినప్పటికీ కరోనా లక్షణాలు ఉండటంతో పోస్ట్ వ్యాక్సిన్‌ లక్షణాలు అనుకుని కాస్త నిర్లక్ష్యం చేశారట. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. కరోనా తీవ్రం కావడంతో ట్రీట్‌మెంట్‌ కోసం వైద్యులను సంప్రదించే లోపే ఆయన గుండెపోటుతో శనివారం మరణించారు.

శ్రవణ్‌ గతంలో ప్రముఖ దర్శకులు వి.ఎన్‌. ఆదిత్య దర్శకత్వం వహించిన `మనసంతా నువ్వే`, `శ్రీరామ్‌` చిత్రాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. తనకు సినిమాలకు సంబంధించి కథా చర్చల్లో కూడా తాను పాల్గొనే వాడని దర్శకుడు వి.ఎన్‌ ఆదిత్య చెబుతూ సంతాపం తెలిపారు. దీంతోపాటు పలువురు సినీ ప్రముఖలు శ్రవణ్‌ మృతికి సంతాపం తెలిపారు. ప్రస్తుతం కరోనాతో పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, కళ్యాణ్‌ దేవ్‌, పూజా హెగ్డే వంటి వారు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న విషయం తెలిసిందే.