ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో(YS Jagan) తెలుగు సినీ ప్రముఖులు నేడు భేటీ కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. భేటీలో ప్రధానంగా.. థియేటర్ ధరలు, టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్, బెనిఫిట్ షోలు వంటివి చర్చకు రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తెలుగు సినీ ప్రముఖులు నేడు భేటీ కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇందుకోసం చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి విజయవాడ బయలుదేరనుంది. వీరు తొలుత ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి చేరుకుంటారు. చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందంలో హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు కొరటాల శివ, రాజమౌళి, నారాయణమూర్తి, నిర్మాత నిరంజన్ రెడ్డితో పాటు మరికొందరు సీఎం జగన్‌తో సమావేశం కానున్నట్టుగా సమాచారం.
ఈ భేటీ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీరంగ సమస్యలకు నేటితో పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. తమ కుటుంబం నుంచి చిరంజీవి వెళ్తున్నారని చెప్పారు. సినీ పరిశ్రమకు మెలు జరిగే ప్రకటన వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక, సినీ ప్రముఖుల బృందం మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలుస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే సీఎం జగన్‌తో సమావేశమై ఎజెండాను సిద్ధం చేశారు. టాలీవుడ్ ప్రతినిధులతో సమావేశంలో చర్చకు రావాల్సిన కీలక అంశాలపై ప్రభుత్వ వైఖరిని సిద్ధం చేశారు. ఈ భేటీలో ప్రధానంగా.. థియేటర్ ధరలు, టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్, బెనిఫిట్ షోలు వంటివి చర్చకు రానున్నాయి.
ఈ భేటీలో ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆయా వర్గాలతో రెండు దఫాలు చర్చించి తుది నివేదిక సిద్ధం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో నిమిత్తం లేకుండా.. ఎక్కడైనా నాన్ ఏసీ థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.40.. ఏసీ థియేటర్‌లో 70 రూపాయలుగా కమిటీ సూచించినట్లు సమాచారం.
ఇక, గత నెలలో జగన్‌తో భేటీ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడేందుకు తాను సీఎం పిలుపుమేరకు వచ్చి కలిసినట్టుగా చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను ఆయనకు వివరించానని తెలిపారు. సినీ పరిశ్రమకు ఒక బిడ్డగానే తానిక్కడికి వచ్చానని అన్నారు. సీఎం సానుకూలంగా తాను చెప్పిన సమస్యలను విన్నారని.. తర్వలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందని చెప్పారు. త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. సీఎం జగన్ తన ఒక్కడినే ఆహ్వానించినందునే ఒక్కడినే వచ్చానని చిరంజీవి స్పష్టం చేశారు. త్వరలో మరోసారి టీమ్ గా వచ్చి జగన్‌ను కలుస్తున్నానని చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే.
