ఈ ఏడాది మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య బలమైన పోటీ జరగనుంది. పవన్ కళ్యాణ్ కూడా తన 'జనసేన' పార్టీ తరఫున బరిలో దిగుతుండడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి పెరిగిపోయింది.

ఇప్పటివరకు ఏ ఎన్నికలు జరిగినా.. సినీ సెలబ్రిటీలు ప్రచారం చేయడానికి వచ్చేవారు. ముఖ్యంగా టీడీపీ పార్టీ తరఫున నందమూరి హీరోలు ప్రచారం చేయడంతో గ్లామర్ టచ్ బాగా వచ్చేది. కానీ కొంతకాలంగా మన తారలు ఈ ఎన్నికల్ ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ పరిస్థితి ఇంకా తగ్గుముఖం పట్టింది.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా సెలబ్రిటీలు ఎవరూ ప్రచారంలో పాల్గొనలేదు. కేసీఆర్, కేటీఆర్ లకు సినిమా వాళ్లతో ప్రత్యేకమైన బంధం ఉన్నప్పటికీ మన 
తారలు మాత్రం ఎన్నికల సమయంలో దగ్గరకి వెళ్లలేదు. ఒక పార్టీకి సపోట్ చేస్తే ఆ పార్టీ మనిషని ముద్ర పడే అవకాశాలు ఉన్నాయని సినిమా వాళ్లు రిస్క్ తీసుకోలేదు. పైగా ఇప్పుడు చాలా మంది సినిమా వాళ్లు రాజకీయ పార్టీల్లో చేరడంతో స్పెషల్ గా ప్రచారాలు చేయడం ఎందుకులే అని భావిస్తున్నారు సినీ సెలబ్రిటీలు.

రాబోయే ఏపీ ఎలెక్షన్స్ లో కూడా సినిమా వాళ్లు ప్రచారాలు చేసే అవకాశం లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున కూడా ఏ హీరో, హీరోయిన్ కానీ ప్రచారం చేయరని టాక్. మెగాఫ్యామిలీ హీరోలు మాత్రం బాబాయ్ పిలిస్తే ప్రచారానికి సిద్ధమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలా గనుక జరిగితే సినీ గ్లామర్ టచ్ ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.