మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీ వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో ఈ మూవీ కథపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నాడని, మహేష్ ఐటీ మినిస్టర్ గా కనిపిస్తారన్న వాదన గట్టిగా వినిపిస్తుంది. అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదంటున్నారు. 

ప్రతి దర్శకుడికి ఓ శైలి ఉంటుంది. ఓ జోనర్ లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీ డ్రామాలు తెరకెక్కించడంలో దిట్ట. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఆయన భారీ హిట్స్ అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన మెజారిటీ చిత్రాలు ఆ కోవకు చెందినవే. కాగా త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు నుండి ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ మూవీ ఈ జోనర్ లో తెరకెక్కిస్తున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

ఇటీవల ఓ పుకారు తెరపైకి వచ్చింది. ఇది పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్ అని, మహేష్ బాబు(Mahesh Babu) ఐటీ మినిస్టర్ గా కనిపిస్తారని కొన్ని కథనాలు వెలువడ్డాయి. దీంతో ఫ్యాన్స్ కొంచెం ఎక్సైటింగ్ ఫీల్ అయ్యారు. గతంలో భరత్ అనే నేను మూవీలో మహేష్ సీఎం రోల్ చేశారు. దర్శకుడు కొరటాల తెరకెక్కించిన ఆ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పొలిటికల్ థ్రిల్లర్ అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొందరు వాదిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు. 

మహేష్ ఐటీ మినిస్టర్ రోల్ చేస్తున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా హైదరాబాద్ శివారులో భారీ సెట్ ఏర్పాటు చేశారట. హారిక హాసిని ప్రొడక్షన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.