టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ దొరస్వామి రాజు తుది శ్వాస విడిచారు. వయోభారంతో బాధపడుతున్న దొరస్వామి రాజు ఆరోగ్యం బాగా క్షీణించినట్లు సమాచారం. దీనితో ఆయన  కొద్దిరోజులుగా బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. నేడు ఉదయం పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంతగా ప్రయత్నం చేసినా... ఆయనను కాపాడలేకపోయారు.  1978లో వీఎంసీ పేరుతో డిస్ట్రిబ్యూషన్‌ సంస్థను స్థాపించిన దొరస్వామి పలు హిట్‌ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేశారు.  ఎన్టీఆర్‌ హీరోగా నటించిన సింహబలుడు డిస్ట్రిబ్యూటర్ గా దొరస్వామి రాజు మొదటి చిత్రం. 

డ్రైవర్‌ రాముడు, వేటగాడు, యుగంధర్‌, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను వీఎంసీ సంస్థ ద్వారా విడుదల చేశారు.దాదాపు 400 సినిమాలు విఎంసి సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. నిర్మాతగా కూడా పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఆయన తెరకెక్కించారు.  సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలేపెళ్లాం వంటి సినిమాలను నిర్మించారు.

 అన్నమయ్య, సింహాద్రి చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ అందుకొని, చరిత్ర తిరగరాశాయి. రాజకీయంగా కూడా దొరస్వామి పలు పదవుల్లో రాణించారు. 1994లో నగరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.  దొరస్వామి రాజు మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నారు.