అమెజాన్ సంస్థ సినిమా డిజిటల్ హక్కుల కోసం కోట్లు చెల్లిస్తుంటే బిజినెస్ బాగా జరుగుతుందని సంబరబడ్డ నిర్మాతలకు ఇప్పుడు ఆ అమెజాన్ కారణంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెజాన్ కి హక్కులు అమ్మితే నెల రోజుల్లో సినిమా ప్రైమ్ కి వచ్చేస్తుందనే సంగతి అందరికీ పాకేసింది. భారీ సినిమాలు, క్రేజ్ ఉన్న సినిమాలను 45 రోజుల్లో, మిగిలిన చిత్రాలను నెల రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో పెట్టేస్తున్నారు.

ఈ విషయంలో వారు ఎక్కడా రాజీ పడరు. దీంతో ఇప్పుడు సినిమాలకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావడం తగ్గించేశారు. సినిమా చాలా బాగుందని టాక్ వస్తే తప్ప వెళ్లడం లేదు. నెల రోజులు ఆగితే ప్రైమ్ కి వచ్చేస్తుంది కదా అనే ధీమాతో ఉంటున్నారు. ఈ కారణంగా వసూళ్లపై ఎఫెక్ట్ పడుతోంది.

దీంతో టాలీవుడ్ నిర్మాతలు అమెజాన్ యాజమాన్యానికి ఓ రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారట. అదేంటంటే.. సినిమాను అమెజాన్ కి అమ్ముతారు. ముప్పై రోజుల్లో ప్రైమ్ లో కూడా పెట్టుకోవచ్చు కానీ థియేటర్ లో సినిమా వేసేప్పుడు మాత్రం ప్రారంభంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ అనే టైటిల్ కార్డ్ వేయకుండా ఉంటామని నిర్మాతలు రిక్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 

అలా చేస్తే సినిమా అమెజాన్ కి వస్తుందా..? లేదా..? అనే విషయం తెలియక జనాలు సినిమా చూస్తారని నిర్మాతల ఆలోచన. మరి దీనికి అమెజాన్ అంగీకరిస్తుందో లేదో చూడాలి!