సినిమా ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో చెప్పడం కష్టమే. అవకాశాలు ఎన్ని వచ్చినా కూడా సక్సెస్ రాకపోవచ్చు. ఒక్క అవకాశం వచ్చినా స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ను అందుకునే అదృష్టం కూడా దక్కవచ్చు. ఏదైనా సినిమా ఇండస్ట్రీలో ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా కాలం కలిసిరావాలి అంటారు. కానీ కథలపై కాస్త జాగ్రత్తలు వహిస్తే మంచి హిట్స్ దక్కే అవకాశం ఉంటుంది. అయితే కొంత మంది యువ హీరోలు కాస్త తొందరపడి కెరీర్ ను కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నారు అని అర్ధమవుతోంది. 

అలాంటి వారిలో సాయి ధరమ్ తేజ్ -  నితిన్ అలాగే రామ్ వంటి మంచి మార్కెట్ ఉన్న హీరోలు ఉన్నారు. ఈ హీరోల్లో మ్యాటర్ ఉందని ఆడియెన్స్ లో ఓ మంచి క్రేజ్ ఉంది కానీ హిట్లే కాస్త దోబూచులాడుతున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది మెగా మేనల్లుడి గురించే. సుప్రీమ్ తరువాత మనోడి టైమ్ అస్సలు బాలేదు. తిక్క నుంచి మొదలు పెడితే తేజ్ ఐ లవ్ యూ వరకు వరుసగా డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్ తో కెరీర్ ను ఊహించని స్థాయికి తెచ్చాడు. వినాయక్ - కరుణాకరన్ వంటి సీనియర్ దర్శకులతో కలిసినప్పటికి ఉన్న లెవెల్ పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. 

ఇక నితిన్ కెరీర్ మొదటి నుంచి జయపాయలకు హయ్, బాయ్ లు చెబుతూనే ఉన్నాడు. మొత్తానికి ఇష్క్ తో రికవర్ అయ్యాడని అనుకున్నప్పటికీ మధ్యలో తడబడ్డాడు. ఇక త్రివిక్రమ్ తో అఆ సినిమా చేసి కెరీర్ లో బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. దీంతో తరువాత లై సినిమాతో ప్రయోగం చేసి మళ్ళీ ప్లాపుల బాట పట్టాడు. చల్ మోహన్ రంగ తో పాటు రీసెంట్ గా వచ్చిన శ్రీనివాస కళ్యాణం కూడా దెబ్బ కొట్టడంతో మరో సారి దీర్ఘంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 

మరో యువ హీరో రామ్ కూడా కెరీర్ ను ఇంకా ఒక లెవెల్లో సెట్ చేసుకోలేక సతమతమవుతున్నాడు. చాలా కాలం తరువాత నేను శైలజా సినిమాతో తనకు కూడా బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టే దమ్ముందని నిరూపించాడు. కానీ వెంటనే మళ్ళీ హైపర్ సినిమాతో మాస్ సైడ్ వెళ్లి డిజాస్టర్ అందుకున్నాడు. ఇక హిట్టిచ్చిన కిషోర్ తిరుమలతో ఉన్నధి ఒకటే జిందగీ అనే సినిమా చేసినప్పటికీ క్లిక్ అవ్వలేదు. ప్రస్తుతం నేను లోకల్ దర్శకుడైన త్రినాధరావుతో ఒక సినిమా చేస్తున్నాడు.  ఆ సినిమా హిట్ అయితే ఈ హీరో హ్యాట్రిక్ డిజాస్టర్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.