వాళ్లు రమ్మన్నారు.. నేను వెళ్లా, నా జీవితంలో ఇదో అనుభవం : ఈడీ విచారణపై విజయ్ దేవరకొండ
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. తన రెమ్యూనరేషన్ గురించి అడిగారని.. తన జీవితంలో ఇదో అనుభవమని రౌడీ స్టార్ మీడియాతో అన్నారు. దాదాపు 11 గంటల పాటు విజయ్‌ని ప్రశ్నించారు అధికారులు.

లైగర్ సినిమా పెట్టుబడులపై టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 11 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు ఈడీ అధికారులు. సినిమాలో విజయ్ పెట్టుబడులపై అధికారులు ఆరా తీశారు. అలాగే ఆయన బ్యాంక్ అకౌంట్లపైనా వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. లైగర్ సినిమాకు విజయ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో కూడా ఆరా తీసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద విజయ్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు ఈడీ అధికారులు.
అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని తెలిపారు. వాళ్లు రమ్మన్నారు.. తాను వెళ్లానని విజయ్ చెప్పారు. తన రెమ్యూనరేషన్ గురించి అడిగారని.. తన జీవితంలో ఇదో అనుభవమని రౌడీ స్టార్ పేర్కొన్నారు. రేపు మరోసారి విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు చెప్పలేదని విజయ్ వెల్లడించారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతగా వ్యవహరించిన ఛార్మి ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండని సైతం విచారించడం హాట్ టాపిక్ అవుతుంది.
ALso REad:ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ.. `లైగర్` పెట్టుబడులపై విచారణ..
`లైగర్` చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు. వంద కోట్లకుపైగానే బడ్జెట్ అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదలై పరాజయం చెందింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఆ నష్టాల వ్యవహారానికి సంబంధించిన లావాదేవీలను సైతం ఈడీ విచారిస్తుంది. ఇదిలా ఉంటే విదేశాల నుంచి ఈ సినిమాకి పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ గుర్తించిందని సమాచారం. అంతేకాదు పలువురు పొలిటికల్ లీడర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారట. దానిపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించబోతుంది.
విజయ్ దేవరకొండని ఈడీ విచారణకు హాజరైన వార్త ఫిల్మ్ నగర్‌లో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. `లైగర్`లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేసింది. వరల్డ్ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైఖేల్ టైసన్ ఇందులో కీలక పాత్రలో నటించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 25న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ `ఖుషీ` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.