సినీ చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. దర్శకనిర్మాతలు కథలను నమ్మి ఎంతో శ్రమ పడి సినిమాలు తీస్తుంటారు. కథ, కథనాలు ఆకట్టుకునే విధంగా ఉంటే ప్రేక్షకులే బ్రహ్మరథం పడతారు. నిరాశ పరిస్తే మాత్రం మేకర్స్ ఘోరమైన ఫ్లాప్ లను మూటగట్టుకోవాల్సినపరిస్థితి ఏర్పడుతుంటుంది. హిట్టు అనే మాట ఎంత బూస్టప్ ఇస్తుందో.. ఫ్లాప్ అనేది అంతగా ఆవేదనకి గురి చేస్తుంది. సినిమాను నమ్మి కొన్న బయ్యర్లను రోడ్డు మీదకు లాగేస్తుంది. ఈ ఏడాదిలో ఇండస్ట్రీలో భారీ హిట్స్ తో పాటు ఘోరమైన ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. ముందుగా ఈ ఏడాది ఆరంభంలో 'అజ్ఞాతవాసి' రూపంలో ఆడియన్స్ కి పెద్ద షాక్ తగిలింది. 

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే 'అజ్ఞాతవాసి' సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా టైటిల్ దగ్గర నుండి పోస్టర్లు, ట్రైలర్, పాటలు అన్నీ కూడా ఆడియన్స్ ని మురిపించాయి. విడుదలకు ముందు దాదాపు వంద కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం,  రెగ్యులర్ ఫార్మాట్ స్క్రీన్ ప్లే ఇవన్నీ కలిసి సినిమాని డిజాస్టర్ చేశాయి. ఈ సినిమా కొని నష్టపోయిన బయ్యర్లను త్రివిక్రమ్, పవన్ ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ తరువాత ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ లు పడుతూనే ఉన్నాయి.

రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దర్శకుడు విక్రమ్ సిరికొండ రెగ్యులర్ కథ, కథనాలతో ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నిస్తే దాన్ని తిప్పికొట్టారు ఆడియన్స్. ఈ సినిమాతో బయ్యర్లు ఎంతగానో నష్టపోయారు. 

చిరంజీవితో 'ఖైదీ నెం 150' సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వినాయక్ ఆ తరువాత సాయి ధరం తేజ్ హీరోగా 'ఇంటెలిజెంట్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో వినాయక్ తన ఇంటలిజెన్స్ ని ఎక్కడా వాడకపోవడంతో సినిమా చూసిన ఆడియన్స్ విసిగిపోయారు. వరుస ఫ్లాప్ ల మీదున్న సాయి ధరం తేజ్ పై ఈ సినిమా మరింత ప్రభావాన్ని చూపింది. ఇప్పటివరకు వినాయక్ తన తదుపరి సినిమాను కూడా అనౌన్స్ చేయలేదంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్ధమవుతోంది. 

త్రివిక్రమ్, పవన్ నిర్మాతలు అంటూ మొదటి నుండి నితిన్ నటించిన 'ఛల్ మోహన రంగ' సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. కృష్ణచైతన్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మొదటిరోజు ఏవరేజ్ టాక్ వచ్చినా.. రెండో రోజుకే డీలా పడింది. ఈ సినిమా ఎఫెక్ట్ తో నితిన్ తన తదుపరి సినిమాల కథల విషయంలో దృష్టి పెట్టాడు. 

అప్పటివరకు ఫ్లాప్ లు లేకుండా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని హీరోగా దూసుకుపోతున్న నాని స్పీడ్ కి బ్రేకులు వేసింది 'కృష్ణార్జున యుద్ధం'. తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే నాని ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించాడు. కానీ ఆ రెండు పాత్రలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాను కాస్త ఫ్లాప్ గా తేల్చేశారు. 

ఈ ఏడాదిలో ఇండస్ట్రీకి ఎదురైన మరో దెబ్బ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాను ఎంతగా ప్రమోట్ చేశారంటే.. ఇక హిట్టు పక్కా అనుకున్నారు. కానీ తెరపై ఈ సినిమాను చూసిన ఆడియన్స్ కి నిరాశే ఎదురైంది. ఈ సినిమా కోసం బన్నీ ఎంతగా కష్టపడినా.. అతడి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా 
తయారైంది. ఈ సినిమా ఎఫెక్ట్ తో బన్నీ ఇప్పటివరకు తన తదుపరి సినిమా విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. వచ్చే ఏడాదిలో అయినా సినిమాను అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు. 

నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమాకి మొదటిరోజే నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దిల్ రాజు అది పట్టించుకోకుండా ప్రమోషన్స్ ఊదరగొట్టాడు. మా సినిమా హిట్ అంటూ తెగ చెప్పుకొని తిరిగాడు. కానీ ఈ సినిమా బయ్యర్లకు నష్టాల్నే మిగిల్చింది. 

విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా విడుదలకు దగ్గరపడిన సమయంలో ప్రమోషన్స్ గట్టిగా చేశారు. తెలంగాణా అసెంబ్లీ ఎలెక్షన్స్ సమయంలో విడుదల చేయడంతో విడుదలకు ముందు సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. చాలా మంది రాజకీయనాయకులు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని నినాదాలు చేశారు. అంతగా  అంచనాలు పెంచేసిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

మంచు విష్ణు నటించిన 'ఆచారి అమెరికా యాత్ర', బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం', సాయి ధరం తేజ్ 'తేజ్ ఐ లవ్యూ', రవితేజ 'అమర్ అక్బర్ అంటోనీ',నాగచైతన్య 'సవ్యసాచి', 'కవచం', కళ్యాణ్ రామ్ 'నా నువ్వే', సందీప్ కిషన్ 'నెక్స్ట్ ఏంటి..?' సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. ఇక గడిచిన శుక్రవారం విడుదలైన 'పడి పడి లేచే మనసు' సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. వరుణ్ తేజ్ 'అంతరిక్షం' కూడా అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలకు ముందు హడావాడి చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ ఏడాది ఇండస్ట్రీ మరిన్ని నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది!