డైరక్టర్స్ నటులు అవ్వటం కొత్త విషయం ఏమీ లేదు. అలా తెరపై కొద్ది సేపు కనపడి అలరించేవాళ్లు కొందరైతే, మరికొందరు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజి అవుతున్నారు. తమ పరిచయాలతో వరస సినిమాలు పట్టుకోగలుగుతున్నారు. దర్శకుడుగా తమకు నటన గురించి  తెలుస్తుంది కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన పని ఉండటం లేదు. ఇప్పటికే  దాసరి నారాయణరావు, భీమినేని శ్రీనివాస రావు, దేవి ప్రసాద్ , కాశీ విశ్వనాధ్ వంటి వాళ్లు నటులుగా తమ సత్తా ఏమిటో చూపెట్టారు.

అంతేకాదు ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ సైతం హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సైతం కోబ్రా అనే సినిమా ద్వారా నటుడుగా మారబోతున్నారు. ఇప్పుడు అదే దారిలో దర్శకుడు తేజ కూడా ప్రయాణం పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు దిల్ రాజు నిర్మిస్తున్న ఓ చిత్రం లో తేజ...నటుడుగా ఓ కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. అయితే ఆయన రియల్ లైఫ్ క్యారక్టర్ ని సినిమాలో చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్టులో తన పాత్ర ఏమిటో విన్న తేజ ఇంట్రస్ట్ గా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు. హీరోయిన్ కు నటన నేర్పే  దర్శకుడుగా ఈ సినిమాలో కనిపించనున్నారు. అయితే ఆయన ఫ్యామిలీకు తేజ నటుడు అవటం ఇష్టం లేదట. మరి తేజ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన తేజ..ది ఓ కొత్త తరహా.  ఉదయ్ కిరణ్, రీమా సేన్ లను పరిచయం చేస్తూ  'చిత్రం' సినిమా ద్వారా తేజ  దర్శకుడిగా పరిచయమయ్యారు. ఏ మాత్రం ఎక్సెపెక్టేషన్స్  లేకుండా విడుదలైన ఈ చిత్రం తేజను దర్శకుడిగా నిలబెట్టింది. ఆ తర్వాత ఇదే పంథా కంటిన్యూ చేస్తూ  తనకు అచ్చొచ్చిన ప్రేమకథలనే తీయడం మొదలుపెట్టారు.

వారిలో 'నువ్వు నేను' చిత్రం అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత నితిన్ హీరోగా వచ్చిన జయం కూడా రికార్డ్ లు క్రియేట్ చేసింది.  ఆ తర్వాత నిర్మాత కూడా మారి సినిమాలు చేసారు. సంబరం సినిమాకు దశరధ్ దర్శకత్వం వహించగా తేజ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ క్రమంలో ఇప్పుడు నటుడు అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం.