Asianet News TeluguAsianet News Telugu

ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత.. నిలిచిన సినిమా షూటింగ్స్..

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ కార్మికులు సమ్మెకు దిగారు. హైదరాబాద్‌  జూబ్లీ హిల్స్ పరిధి వెంకటగిరిలోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన దిగారు. 

Tollywood cine workers protest at film federation office in hyderabad
Author
First Published Jun 22, 2022, 1:11 PM IST

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ కార్మికులు సమ్మెకు దిగారు. హైదరాబాద్‌  జూబ్లీ హిల్స్ పరిధి వెంకటగిరిలోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన దిగారు. ఈ ఆందోళనల్లో ఫెడరేషన్‌కు చెందిన 24 విభాగాల కార్మికులు పాల్గొన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్‌లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది.

ఇక, ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్దకు చేరకున్న సినీ కార్మికులు.. 30 శాతం వేతనాలు పెంచాలని కోరుతున్నారు. నాలుగేళ్ళుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని, దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం తలకు మించిన భారమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకునేవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. సినీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

వేతనాల పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తమ చేతుల్లో ఏమి లేదని ఫెడరేషన్‌ కార్యవర్గ సభ్యులు నిన్న ఫిల్మ్‌ చాంబర్‌, నిర్మాత మండలిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ కామర్స్‌ నూతన అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ అన్నారు. ఫెడరేషన్‌ నుంచి తమకు ఎలాంటి సమ్మె నోటీసులు రాలేదని, ఒకవేళ కార్మికులు సమ్మె చేయాలనుకుంటే 15 రోజుల ముందు నోటిసుల ఇవ్వాలని తెలిపారు.

కాగా.. గడిచిన రెండేళ్లుగా సినీ పరిశ్రమ కోవిడ్ కారణంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్దితులు చక్కబడుతుండటంతో ఇండస్ట్రీ కోలుకుంటోంది. మరోవైపు సినిమాల్లో హీరోలకు కోట్లకు కోట్లకు ఇచ్చే నిర్మాతలు .. అందులో పనిచేసే 24 క్రాఫ్ట్ మెంబర్స్‌కు మాత్రం తగిన వేతనాన్ని ఇవ్వడం లేదు. గత కొన్నేళ్లుగా సినీ కార్మికుల వేతనాల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఇంటా బయటా అన్నింటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కానీ.. దానికి తగ్గట్టు జీతాలు మాత్రం పెరగడం లేదు. దీంతో గత కొన్నేళ్లుగా సినీ కార్మికులు వేతనాలు పెంచమంటూ  నిర్మాతల మండలిపై ఒత్తిడి చేస్తూ వచ్చారు. అటు ఫెడరేషన్ కూడా కార్మికుల వేతనాల  అంశాన్ని సాగదీస్తూ వచ్చింది. దీనిపై భగ్గుమన్న కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios