పెద్ద సినిమాలకు రేట్లు పెంచారంటే అర్దం ఉంది. కానీ చిన్న సినిమాలు కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకోవటమే ప్రేక్షకుడుకి నిజమైన భారం అవుతుంది. సినిమా థియోటర్ కు వెళ్లి చూడాలనే కోరికను చంపేస్తుంది. కరోనా వలన సినిమా దెబ్బ తిని ఉండవచ్చు...రిలీజ్ లు లేటు అవటం వల్ల వడ్డీలు పెరిగిపోయి ఫైనాన్స్ లతో నిర్మాతలు ఇబ్బంది పడి ఉండవచ్చు . కానీ సాధారణ జనం కూడా అదే పరిస్దితిని ఎదుర్కొన్నారే. వారికేమీ కరోనా వలన ఆదాయ మార్గాలు పెరగలేదే. 

 కొద్దిరోజుల పాటు  డిస్ట్రిబ్యూటర్లకు టికెట్ల ధరలను పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలే ఇవ్వడంతో చిన్న సినిమాలు పెంచేస్తున్నాయి. క్రిందటి నెలలో వచ్చిన మెగా మేనల్లుడు ఉప్పెనకు ప్లే చేసిన ఈ టిక్కెట్లు పెంచటం అనే స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యి భారీ వసూళ్లకు ఒక కారణంగా నిలిచింది.  ఇప్పుడు అదే స్ట్రాటజీని శ్రీకారం కు కూడా అప్లై చేయబోతున్నట్లు సమాచారం.

మహా శివరాత్రి పండగ సందర్భంగా విడుదల కాబోతున్న శర్వానంద్ శ్రీకారం కూడా టిక్కెట్లు పెంచబోతున్నట్టు తెలిసింది. సింగల్ స్క్రీన్లలో 150 రూపాయలు, మల్టీ ప్లెక్సుల్లో 200 రూపాయల దాకా టికెట్ ధర పెంచుకునే పర్మిషన్ ఇప్పటికే ఇచ్చినట్టు టాక్. అలాగే ప్రసాద్ లార్జ్ స్క్రీన్ లో మొన్నే 350 రూపాయల టికెట్ ధరను పెట్టే అడ్వాన్స్ బుకింగ్ మొదలెట్టేసారు. మిగిలిన స్క్రీన్లు కూడా ఈ రోజు నుంచి అప్ డేట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ రేట్లు చూసి సామాన్య ప్రేక్షకుడు కంగారు పడుతున్నాడు. ఓటీటిలో చూడచ్చులే అని ఫిక్స్ అవుతున్నాడు. 
 
విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శర్వానంద్‌. వ్యవసాయం ఇతివృత్తంగా ‘శ్రీకారం’తో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు. నూతన దర్శకుడు కిషోర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక్ అరుళ్‌ మోహన్‌ కథానాయిక. 14రీల్స్‌ పతాకంపై రామ్‌ అచంట, గోపీ అచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

శర్వానంద్‌ మాట్లాడుతూ.... ‘కథ వినగానే ఈ సినిమా చేయడం నా బాధ్యత అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథలు మళ్లీమళ్లీ రావు. పండించేవాళ్లు తక్కువైపోతున్నారు.. తినేవాళ్లు ఎక్కువైపోతున్నారు. రైతులు పండిస్తేగానీ మనం తినలేం. ఇంత మంచి కథ ఎంచుకున్న కిషోర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఈ కథ వినడానికి నాకు కుదరకపోయినా.. నాకోసం చాలారోజులు ఎదురుచూసి మరీ కథ చెప్పారు. ఇంతమంచి డైలాగ్స్‌ రాసిన సాయిమాధవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. 

నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు పెట్టి కమర్షియల్‌ సినిమాలు చేయడం చాలా సులభం. కానీ.. ఇలాంటి సినిమాను నమ్మడం నిర్మాతల గొప్పతనం. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా ఇవ్వబోతున్నాం. ట్రైలర్‌ చూడగానే చరణ్‌ ఫోన్‌ చేశాడు’ అని శర్వానంద్ చెప్పారు.