ఏపీలో 175 థియేటర్లు క్లోజ్.. RRR, రాధే శ్యామ్ పరిస్థితి ఏంటి ?
అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ లాంటి భారీ చిత్రాలు థియేటర్స్ లో విడుదల కావడంతో టాలీవుడ్, థియేటర్స్ కి పూర్వ వైభవం వచ్చినట్లు అయింది. ఈ చిత్రాలని చూసేందుకు జనాలు థియేటర్స్ కి ఎగబడుతున్నారు.
అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ లాంటి భారీ చిత్రాలు థియేటర్స్ లో విడుదల కావడంతో టాలీవుడ్, థియేటర్స్ కి పూర్వ వైభవం వచ్చినట్లు అయింది. ఈ చిత్రాలని చూసేందుకు జనాలు థియేటర్స్ కి ఎగబడుతున్నారు. అయినప్పటికీ చిత్ర పరిశ్రమ సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు.
ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల్ని భారీగా తగ్గించడంతో థియేటర్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కనీసం కరెంట్ ఛార్జీలకు కూడా గిట్టుబాటు కానీ విధంగా టికెట్ ధరలు ఉన్నాయి అంటూ వాపోతున్నారు. కానీ టాలీవుడ్ పెద్దలు మాత్రం మౌనం వహిస్తున్నారు. టికెట్ ధరల సమస్యపై ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడారు. అందులో నాని, పవన్ కళ్యాణ్, సిద్ధార్థ్ ఉన్నారు.
ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్స్ పై ఆంక్షలు తీవ్రతరం చేస్తోంది. నిబంధనలు, ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరల్ని ఫాలో అవ్వని థియేటర్స్ ని అధికారులు సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలతో థియేటర్లు నడపడం సాధ్యం కాదు అంటూ కొందరు స్వచ్ఛందంగానే మూసేస్తున్నారు. అలా గత వారం రోజుల్లో ఏపీలో 175 థియేటర్లు మూతపడ్డాయి.
దీనితో ప్రస్తుతం థియేటర్స్ లో ప్రదరించబడుతోన్న పుష్ప, శ్యామ్ సింగ రాయ్, అఖండ చిత్రాలకు అంతరాయం ఏర్పడుతోంది. టికెట్ ధరలు, థియేటర్లు మూతపడడం లాంటి సమస్యలు ఆ చిత్రాల వసూళ్లపై ప్రభావం చూపనున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆ చిత్రాలు వందల కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించబడ్డాయి. ఆ చిత్రాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒమిక్రాన్ భయం కూడా మరోవైపు వెంటాడుతోంది.