బాలీవుడ్ లో మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పిలిపించుకునే ఆమీర్ ఖాన్ నటించిన తాజాగా చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్'. ఈ సినిమాలో ఆమీర్ తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ముఖ్య పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు కష్టపడ్డారు. బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సక్సెస్ అందుకుంటుందనుకున్న ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఈ సినిమా దీపావళి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా ట్రైలర్ చూసిన కొందరు హాలీవుడ్ లో వచ్చిన 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సినిమాకి ఫ్రీమేక్ ఉందని కామెంట్స్ చేశారు. ఇప్పుడు సినిమాకి కూడా ఆ తరహా రెస్పాన్స్ రావడం గమనార్హం. ట్విట్టర్ లో ఈ సినిమా బావుందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందని అంటున్నారు.

ఆమీర్ ఖాన్ తన కామెడీతో మెప్పించలేకపోయారని అమితాబ్ బచ్చన్ నటన ముందు ఆమీర్ ఖాన్ తేలిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు హీరోయిన్ల నటన మాత్రం బాగుందని అంటున్నారు. అమితాబ్ అభిమానులను ఈ సినిమా మెప్పిస్తుందని, ఆమీర్ ఫ్యాన్స్ కి మాత్రం పెద్దగా ఎక్కదని అంటున్నారు.