కలియుగ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెలవంటూ వెళ్లిపోయారు. వేలకొలది పాటల్లో మధురమైన ఆయన గళాన్ని భద్రపరిచి  దూరమయ్యారు. ఒక పరిశ్రమ కాదు, భాష కాదు ఎల్లలు లేకుండా బాలు తన పాటలతో శ్రోతల మనసులు దోచుకున్నారు. ఆయన మరణించాడన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఏది ఏమైనా బాలు ఇకలేరన్న నిజాన్ని మనం ఒప్పుకోక తప్పదు. బాలు గొంతు మూగబోవడానికి కారణం అందరికీ తెలుసు. మహమ్మారి కరోనా ఆయనను బలితీసుకుంది. 

ఆగస్టు 5వ తేదీన బాల సుబ్రహ్మణ్యం కరోనా సోకిందని, ఆసుపత్రిలో జాయిన్ అయ్యానని, ఎవరూ బాధపడవద్దు...తిరిగి వస్తాను అని ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఆ తరువాత బాలు ఆసుపత్రి బెడ్ పైకి చేరారు. ఐతే బాలుకు కరోనా ఎలా సోకిందనేది ఇక్కడ ప్రధాన అంశం. బాలుకు కరోనా సోకడానికి కారణం మ్యూజిక్ షో సామజవరగమనా అని అంటున్నారు. సామజవరగమన మ్యూజిక్ షో కోసం బాలు షూటింగ్ లో పాల్గొనగా ఆ సమయంలోనే బాలు కరోనా బారినపడ్డారని వినికిడి. 

ఈ షోలో పాల్గొన్న సింగర్స్ సునీత, మాళవికలకు కూడా కరోనా సోకింది. మాళవిక వలనే బాలుకు కరోనా సోకిందని అప్పుడు కథనాలు రావడం జరిగింది. ఐతే ఆ వార్తలను మాళవిక ఖండించారు. బాలుగారికి కరోనా సోకడానికి కారణం నేను అనడంలో ఎటువంటి నిజం లేదని మాళవిక చెప్పారు. కానీ బాలు ఆ ప్రోగ్రాం షూటింగ్ లో పాల్గొనడం కారణంగానే కరోనా బారినపడ్డారనేది నిజం అంటున్నారు. కాగా బాలు గారు కరోనా పై ఓ పాట రాసి దానిని స్వయంగా పాడారట.