ఇండియాలోనే తిరుగులేని స్టార్ డమ్ సంపాదించారు రజిని కాంత్. ఈ ఆల్ ఇండియా సూపర్ స్టార్ నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజు రజిని  కాంత్ కి మరియు అభిమానులకు చాలా ప్రత్యేకం అని చెప్పాలి. దానికి కారణం రజిని తన పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఆయన పార్టీని ప్రకటించడంతో పాటు, రానున్న ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. త్వరలో రజిని కాంత్ పార్టీకి ఎన్నికల కమీషన్ గుర్తు కేటాయించనుంది. 
 
చాలా కాలంగా రజిని కాంత్ అభిమానులు ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. 2021 ఎన్నికలలో రజిని కాంత్ పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి తేవడం జరిగింది. అభిమానుల కోరిక మేరకు రజిని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాలలో అనిశ్చితి ఏర్పడింది. అధికార పార్టీలోనే చీలికలు ఏర్పడ్డాయి. తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలుగా ఉన్న ఏ ఐ ఏ డి ఎమ్ కె, డి ఎమ్ కె పార్టీలలోని ప్రధాన నాయకులు జయలలిత, కరుణా నిధి మరణించడం జరిగింది. 
 
తాజా పరిస్థితులు రజినీకి ఉపకరించే అవకాశం కలదు. ఎన్నికలకు ఇంకా నెలల సమయం మాత్రమే ఉండగా రజిని ఎలా సన్నద్ధం అవుతారనేది ఆసక్తికరం. రజిని మిత్రుడు కమల్ హాసన్ కూడా రానున్న ఎన్నికలలో పోటీ చేయనున్నారు. వీరిద్దరూ కలిసి పోటీకి దిగుతారనే వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఇక రజిని ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే మూవీలో నటిస్తున్నారు.