రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఆఫీసర్' సినిమా వివాదాల్లో చిక్కుంది
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఆఫీసర్' సినిమా వివాదాల్లో చిక్కుంది. తన కథ కాపీ చేసి వర్మ ఈ సినిమా చేశారంటూ రచయిత జయకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు వర్మ ఈ సినిమా కథ గురించి కొత్త విషయాలు చెప్పుకొచ్చాడు. జయకుమార్ పేరుని ఎక్కడా ప్రస్తావించకుండా.. ఆఫీసర్ కథ ఎలా పుట్టిందో తెలిపాడు. కర్ణాటకకు చెందిన కె.ఎం.ప్రసన్న అనే ఐపీఎస్ అధికారి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
ముంబైకి చెందిన పేరున్న పోలీస్ అధికారిని దర్యాప్తు చేయడానికి స్పెషల్ గా ప్రసన్నను నియమించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను ప్రసన్న తనకు 2010లో చెప్పారని, అవి విన్న తరువాత ఆఫీసర్ సినిమా చేయాలనే ఆలోచన వచ్చినట్లుగా వర్మ చెప్పారు.
ప్రసన్నలో నాగార్జున పోలికలు ఉన్నాయని, ఇద్దరినీ కలిసిన తర్వాత ఆలోచనా విధానం కూడా ఒక్కటేనని అందుకే ఆఫీసర్ పాత్రలో నాగార్జునను చూపించినట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా జూన్ 1న విడుదలకు సిద్ధమవుతోంది.
