హీరో దగ్గుబాటి రానా పెళ్ళి వేడుక ఆద్యంతం వైభవంగా జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయిని ఎట్టకేలకు తన వశం చేసుకున్నాడు. మిహీకా బజాజ్‌ మెడలో శనివారం రాత్రి మూడుముళ్ళు వేశాడు. పరిమిత అతిథులతో రానా-మిహీకా పెళ్ళివేడుక ఆద్యంతం కనువిందుగా సాగింది. కరోనా విజృంభన నేపథ్యంలో చాలా వరకు అతిథులకు వర్చువల్‌ వీడియోలో చూసే అవకాశం కల్పించారు. దీంతో అనేక మంది గెస్ట్ లు తమ ఇంట్లో నుంచే రానా మ్యారేజ్‌ ఈవెంట్‌ని తిలకించారు. హీరో నాని ఏకంగా రానా పెళ్ళిపై, వర్చువల్‌ టెక్నాలజీపై సెటైర్లు వేయడం ఆకట్టుకుంది. 

ఇక హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రానా కుటుంబ సభ్యులు సురేష్‌బాబు, హీరో వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య, సమంతతోపాటు మిహీకా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక చాలా పరిమిత సంఖ్యలోనే సినిమా రంగానికి చెందిన అతిథులు హాజరయ్యారు. వారిలో రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన, అలాగే అల్లు అర్జున్‌ సందడి చేశారు. రాయల్‌ స్టయిల్‌ లో జరిగిన ఈ పెళ్లి అనంతరం రానా, మిహీకా బజాజ్‌ ఫ్యామిలీస్‌ కలిసి దిగిన గ్రూప్‌ ఫోటో అబ్బురపరుస్తుంది. మరోవైపు పెళ్లిలో కూడా రానా తనదైన డామినేటింగ్‌ మ్యానరిజంతో ఆకట్టుకున్నారు. 

గతకొంత కాలంగా ప్రేమిస్తున్న మిహీకాకు రానా మేలో ప్రపోజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఓకే చెప్పిందనే విషయాన్ని `ఎస్‌ చెప్పింది` అంటూ ట్వీట్‌ చేసి తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మూడు నెలల్లోనే మ్యారేజ్‌ చేసుకుని ఓ ఇంటివాడైపోయాడు. ఇదిలా ఉంటే రానాపై బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ `శాశ్వత లాక్‌డౌన్‌కి ఇదే సరైన దారి` అని సెటైర్లే వేస్తూ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.