దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో బాలకృష్ణ 'బందిపోటు' అవతారంలో కనిపిస్తున్నారు. సినిమా మరో టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. అదే 'కథానాయకుడు'. ఈ పోస్టర్ ని షేర్ చేసిన దర్శకుడు క్రిష్.. ''ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు..'' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.

పోస్టర్ లో బాలయ్య కూడా ఇమిడిపోయి నటించినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా గనుక సక్సెస్ అయితే బాలయ్య కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాలో  బసవతారకం పాత్రలో బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్ నటిస్తుండగా.. నారా చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుబాటి, ఏఎన్నార్ పాత్రలో సుమంత్ లు కనిపించనున్నారు.   ప్రస్తుతం కృష్ణాజిల్లా దివిసీమలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

హంసలదీవి సమీపంలో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణతో పాటు కీలక పాత్రధారులంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. బుధవారం నుంచి శనివారం వరకూ అక్కడే షూటింగ్‌ జరగనుంది.  జనవరి 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.