బాహుబలి సినిమా తరువాత నార్త్ మీడియా ఒక్కసారిగా టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచిందని అందరికి తెలిసిందే. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరికంటే వారే ఎక్కువగా ఎదురుచూశారు. ఫైనల్ గా నేడు ఈవెంట్ తో భారీ మల్టీస్టారర్ RRR కు శ్రీకారం చుట్టడంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో కూడా న్యూస్ వైరల్ గా మారింది. 

ఇక సినిమాలో మిగతా నటీనటులు ఎవరనే విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు గాని బ్యాక్ గ్రౌండ్ మొత్తం మళ్ళీ దాదాపు బాహుబలి సైన్యమే చేరినట్లు చెప్పేశారు. ఒకరిద్దరు తప్పితే అందరూ జక్కన్న ఆస్తాన టెక్నీషియన్సే. 

ఎమ్ఎమ్.కీరవాణి సంగీతం - సినిమాటోగ్రఫీ సెంథిల్ కుమార్ - ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్ అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి - కథ విజయేంద్ర ప్రసాద్ - విజువల్ డిఫెక్ట్స్ డిజైనర్ వి.శ్రీనివాస్ మోహన్ -  ఇలా అందరూ బాహుబలికి పనిచేసిన వారే. 

రాజమౌళితో ఎప్పుడూ ఉండే గ్యాంగ్ కూడా అదే అని చెప్పవచ్చు. ఇక బాహుబలికి డైలాగ్స్ అందించిన కర్కీ RRRకి కూడా మాటలు అందించనున్నాడు. ఆయనతో పాటు టాలీవుడ్ ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్ర, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్  జక్కన్న తో మొదటిసారి కలవనున్నారు.