థియేటర్ల ఓపెనింగ్‌ కోసం ప్రపంచ చిత్ర పరిశ్రమలు మొత్తం ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా మన భారతీయ సినీ పరిశ్రమలు ఎన్నో ఆశలతో వెయిట్‌ చేస్తున్నాయి. థియేటర్‌లో సినిమాని రిలీజ్‌ చేయాలని వెయ్యి కళ్ళతో దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.

ఓ వైపు వడ్డీల భారం పెరిగిపోతుంది. సినిమా పూర్తి చేసుకుని స్టూడియోల్లో మూలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్‌ ఓపెన్‌ అయితే దర్శక, నిర్మాతలకు అంతకంటే ఆనందం మరొకటి లేదు. థియేటర్లు ఓపెన్‌ అయితే షూటింగ్‌లు ఊపందుకుంటాయి. చిత్ర పరిశ్రమల్లో మళ్ళీ షూటింగ్‌ల కళ మొదలవుతుంది.  సినీ కార్మికులకు పని దొరుకుతుంది. వారింట్లో ఆనందం నెలకొంటుంది. సినిమాని చూడాలని ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న ఆడియెన్స్ రావడంతో థియేటర్లకి కళొస్తుంది. థియేటర్లు ఓపెన్‌ అయితే పరోక్షంగా, ప్రత్యక్షంగా లక్షల మంది ఉపాధి పొందుతారు. 

కరోనా వల్ల మార్చి 22న మూత పడ్డ థియేటర్లు ఇప్పటి వరకు ఓపెన్‌ కాలేదు. థియేటర్లు ఓపెన్‌ చేస్తే కరోనా విజృంభిస్తుందనే భయంతో వాటిపై నిషేధం విధిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇటీవల అన్ని రంగాలకు సడలింపులు ఇచ్చారు. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా త్వరలో మెట్రోలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక మిగిలిన థియేటర్లని కూడా ఓపెన్‌ చేయాలనే డిమాండ్‌, రిక్వెస్ట్ చిత్ర పరిశ్రమ వర్గాల నుంచి, ఎగ్జిబిటర్ల నుంచి వినిపిస్తుంది. 

ఈ నేపథ్యంలో కేంద్రం థియేటర్ల ఓపెన్‌కి సంబంధించి నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నెల 8న దీనిపై సినీ పెద్దలతో కేంద్ర హోంశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. ఇందులో థియేటర్ల ఓపెనింగ్‌, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలను చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 

ఈ మీటింగ్‌లో ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు పిర్దూశల్‌ హాసన్‌, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ నుంచి నిర్మాత సి.కళ్యాణ్‌తోపాటు ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు కొట్టారకర రవి, జైరాజ్‌, నందకూమార్‌, సునీల్‌ నారంగ్‌, త్రిపుర్‌ సుబ్రమణియన్‌, కాట్రగడ్డ ప్రసాద్‌ హాజరు కానున్నారు. మొత్తంగా థియేటర్లకి త్వరలోనే శుభవార్త రాబోతుందని చెప్పొచ్చు.