భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఈ సినిమా ట్రైలర్ మొన్న గురువారం విడుదలైంది. ఆ ట్రైలర్ ఇప్పుడు ట్విటర్‌లో బాగా ట్రెండ్ అయ్యింది. ఈ ట్రైలర్‌ను ఇప్పటివరకు 37 మిలియన్‌ మందికి పైగా చూసారు.అంతేకాదూ రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఈ సినిమాలో వాస్తవాలను వక్రీకరించి చూపించారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తుండగా, బీజేపీ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ ట్రైలర్ మిస్సైంది.  ఈ వీడియో యూట్యూబ్‌లో కనిపించడంలేదట. ఈ విషయాన్ని అనుపమ్‌ ఖేర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ యూట్యూబ్‌ వ్యవహారం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.

‘డియర్‌ యూట్యూబ్‌.. ‘యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్’ అని యూట్యూబ్‌లో టైప్‌ చేస్తుంటే వీడియో కన్పించడంలేదు. ఈ విషయం గురించి నాకు అభిమానుల నుంచి మెసేజ్‌లు, కాల్స్‌ వస్తున్నాయి. మొన్నటివరకు మా ట్రైలర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు చూస్తే కనీసం 50వ స్థానంలో కూడా లేదు. అసలు కనిపించడంలేదు. సాయం చేయండి.’ అని వెల్లడిస్తూ అభిమానుల కోసం మరోసారి ట్రైలర్‌ లింక్‌ను పోస్ట్‌ చేశారు.

ఇక మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వద్ద జాతీయ భద్రతా సలహాదారుడిగా వ్యవహరించిన సంజయ్‌ బారూ..మన్మోహన్‌ జీవితాధారంగా రాసిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అనే బయోగ్రఫీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

ఇక ట్రైలర్‌ రిలీజ్ అయ్యాక  సినిమాపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాను ముందు తమకు చూపించాల్సిందిగా డిమాండ్‌ చేసింది. అయితే ప్రత్యేక స్క్రీనింగ్‌కు మన్మోహన్‌ ఒప్పుకొంటేనే వేస్తామని అనుపమ్‌ స్పష్టం చేశారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదల అవుతోంది.