సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై వేదింపులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు హీరోయిన్లు మాత్రమే ఈ ట్రోలింగ్‌ల బారిన పడేవారు ఇప్పుడు హీరోలు, దర్శకులకు కూడా ట్రోలింగ్‌ బెడద తప్పటం లేదు. తాజాగా ఓ టాలీవుడ్‌ యువ దర్శకుడికి ట్రోలింగ్ షాక్ తగిలింది. పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడి సూపర్ హిట్ అందుకున్న తరువాత తరువాత మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా కూడా ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం తన తదుపరి చిత్రం పనుల్లో బిజీగా ఉన్న ఈ యువ దర్శకుడు ఇటీవల ఓ మలయాళ సినిమాను పొగుడుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరిలో ఓ కామెంట్ పెట్టాడు. మలయాళ సినిమా కప్పెలను పొగుడుతూ కామెంట్ చేసిన తరుణ్  `హీరో పిచ్చోడిలా రీసౌండ్ చేస్తూ అరవడు, అందరికంటూ స్మార్ట్ గా డైలాగుల్లో సామెతలు చెప్పరు, గాల్లో ఎగిరే ఫైట్లు చేయరు, రెండు నిముషాలకోసారి ప్రత్యక్షమవరు.. ఆఖరి పది నిముషాల్లో దేశభక్తి, రైతులకు, సేవ.. వంటి మెసేజెస్ ఇవ్వరు.. అయినా అక్కడ ఈ సినిమా చూశారు` అంటూ కామెంట్ చేశాడు.

అయితే చివర్లో దేశభక్తి, రైతులు అనే పదాలు వాడటంతో ఈ కామెంట్స్‌ తరుణ్‌ మహేష్ బాబును ఉద్దేశించే చేశాడని భావించారు ఫ్యాన్స్. దీంతో సోషల్ మీడియా వేదికగా తరుణ్ మీద దాడి మొదలైంది. ట్రోలింగ్ శృతిమించుతుండటంతో తరుణ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. తనపై కామెంట్లు చేసిన ఇద్దరు వ్యక్తుల వివరాలను కూడా పోలీసులకు అందించాడు. తాను కంప్లయింట్ చేసిన రిసీట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.