ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ఇన్ని రోజులూ మౌనంగా ఉన్న టీడీపీకి ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చిందా? అని ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీకి ఇన్నిరోజులు నచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చెడ్డవాడయ్యాడా? అని ప్రశ్నించారు. పవన్ వెనుక బీజేపీ ఉందని తాను అనుకోవట్లేదని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నారా లోకేశ్ పై పవన్ ఆరోపణలు చేయడం మాత్రం సబబు కాదని అన్నారు.

 ఏపీకి ప్రత్యేకహోదాపై ఏపీ ఎంపీలందరూ ఢిల్లీలో చేస్తోంది పొలిటికల్ డ్రామా అని విమర్శించారు. రాజకీయంగా పైచేయి కోసమే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రకటన చేశారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో అన్ని రాజకీయపార్టీలు ఏకతాటిపైకి వస్తే సినీ పరిశ్రమ కూడా కలిసి వస్తుందని అన్నారు. తమిళనాడులో జల్లికట్టుపై అందరూ ఏకతాటిపైకి వచ్చారు కనుకనే సినీ పరిశ్రమ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.