మెగాస్టార్ చిరంజీవి మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ చేస్తున్న విషయం. మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రను చిరంజీవి చేస్తున్నారు.  పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. లూసిఫర్ తెలుగులో తెరకెక్కించే బాధ్యతలు తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దక్కించుకున్నారు. లూసిఫర్ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ చేయాల్సి ఉంది. మలయాళ స్క్రిప్ట్ కి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే బాధ్యతలు చిరంజీవి సుజీత్ కి అప్పగించారు. 


కారణం ఏదైనా కానీ సుజీత్ చేతి నుండి ఈ ప్రాజెక్ట్ చేజారి మోహన్ రాజాకు దక్కింది. కొన్నాళ్ళు వివి వినాయక్ పేరు కూడా గట్టిగా వినిపించింది. గతంలో చిరంజీవితో వివి వినాయక్ చేసిన రెండు రీమేక్స్ ఠాగూర్, ఖైదీ 150 భారీ విజయాలు అందుకున్న నేపథ్యంలో వివి వినాయక్ లూసిఫర్ రీమేక్ చేస్తారని అందరూ భావించారు. అంచనాలకు భిన్నంగా చిరంజీవి మోహన్ రాజాను ఎంచుకున్నారు. 


కాగా ఈ మూవీకి మ్యూజిక్ అందించే బాధ్యలు తమన్ దక్కించుకున్నారు. ఈ మేరకు థమన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కనున్న లూసిఫర్ రీమేక్ కి మ్యూజిక్ అందిస్తున్నట్లు థమన్ ట్వీట్ చేశారు. చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా థమన్ వర్ణించడం విశేషం. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి త్వరలోనే లూసిఫర్ తెలుగు రీమేక్ పట్టాలెక్కించనున్నారని సమాచారం.