తమిళనాడు మొదటి దశ ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే వీరిలో దళపతి విజయ్‌, తలా అజిత్‌ ఓటు హక్కు వినియోగించుకున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా, వైరల్ గా మారింది. విజయ్‌ ఊహించని విధంగా పోలింగ్‌ సెంటర్‌కి సైకిల్‌పై వెళ్లడం విశేషం. ఆయన ఇంటి వద్ద నుంచి పోలింగ్‌ స్టేషన్‌ వరకు సైకిల్‌ తొక్కుతూ వెళ్లారు. చాలా వేగంగా ఆయన సైకిల్‌ తొక్కుతున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విజయ్‌ సైకిల్‌పై వెళ్తున్న విషయం గురించిన అభిమానులు, వాహనదారులు ఆయన్నీ ఫాలో అయ్యారు. కొందరు ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విజయ్‌ సైకిల్‌పై రావడం హైలైట్‌గా మారింది. 

మరోవైపు అజిత్‌ తన భార్య షాలినితో కలిసి పోలింగ్‌ స్టేషన్‌కి వచ్చారు. ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అజిత్‌ని చూసి అభిమానులు, అక్కడి జనం మొత్తం ఆయన్ని చుట్టు ముట్టారు. అజిత్‌, తలా అంటూ అరిచారు. కొందరు అజిత్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో అజిత్‌కి కోపం వచ్చింది. తన అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకుంటున్న ఓ అభిమాని సెల్ ఫోన్‌ లాక్కున్నాడు. లాక్కుని జేబులో పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న వారందరిని వెళ్లిపోవాలంటూ మందలించారు. పక్కన ఉన్న పోలీసులు కూడా అభిమానులను చెదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.