శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే జీవితం ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఠాక్రే’ అనే టైటిల్‌ను పెట్టి ట్రైలర్ ని వదిలారు. అభిజీత్‌ పాన్సే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో...  ఠాక్రే పాత్రలో నవాజుద్దిన్‌ సిద్ధిఖి నటించారు.  ఈ  చిత్రం జనవరి 25న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలయ్యే రోజున మరే చిత్రాన్నీ విడుదల చేయడానికి వీల్లేదని ఓ శివసేన కార్యకర్త సోషల్‌మీడియా ద్వారా హెచ్చరించటం వార్తలకు ఎక్కింది. అయితే ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం కాదని మీడియా వర్గాలు అంటున్నాయి. 

‘ఠాక్రే బయోపిక్‌ విడుదలయ్యే రోజున మరెవరైనా ఇతర సినిమాలను విడుదల చేస్తే శివసేన స్టైల్‌లో వారికి బుద్ధి చెప్తాం’ అని లోకారే హెచ్చరించారు. శివసేనకు  చెందిన చిత్రపట్‌ వర్కర్స్‌ యూనియన్‌ విభాగానికి సెక్రటరీగా వ్యవహరిస్తున్న బాలా లోకారే తీసుకున్న నిర్ణయమిది. ఈ విషయం గురించి శివసేన నేత, ‘ఠాక్రే’ చిత్ర రచయిత సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. ‘ఇది లోకారే వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఈ నిర్ణయంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. 

ఈ సినిమాలో మూడు సీన్స్ తొలగించాలని సెన్సార్‌ బోర్డు ఆదేశించింది. సినిమాలో బాబ్రీ మసీదుకు సంబంధించిన సన్నివేశాలు, ఠాక్రే దక్షిణాది ప్రజల గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని తొలగించాలని సెన్సార్‌ బోర్డు ఆదేశించిందట. ఆ సన్నివేశాలు తొలగించకుండానే శివసేన ఎంపీ, చిత్ర నిర్మాత సంజయ్‌ రౌత్‌, బాల్‌ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్‌ వాటిని తొలగించకుండానే ట్రైలర్‌ను విడుదల చేసేశారు.