తమిళనాడు నిర్మాతల మండలికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ మండలి అధ్యక్షుడు విశాల్ సోమవారం చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నిర్మాతల మండలిలో అవకతవకలు జరుగుతున్నాయని, నిధులను సక్రమంగా వినియోగించడంలేదనే ఆరోపణలు వస్తోన్న నేపధ్యంలో ప్రభుత్వం కల్పించుకొని  నిర్మాతల  మండలిని తన చేతులోకి తీసుకొంది. శేఖర్ అనే అధికారిని నియమిస్తూ మండలికి సంబంధించిన ప్రతి విషయంలో ఆయన అనుమతి తీసుకునేలా ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ విశాల్ కోర్టుని ఆశ్రయించాడు. ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి పూర్తి అయిందని, మండలి ఆదాయ, వ్యయ వివరాలను సభ్యుల ముందు ప్రవేశ పెట్టి వారి ఆమోదం పొందడానికి మే 1వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నామని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో తదుపరి ఎన్నికల తేదీ గురించి ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఇలాంటి సమయంలో ప్రభుత్వం.. నిర్మాతల మండలికి ప్రత్యేక అధికారిని నియమించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. నిర్మాతల మండలిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అలాంటప్పుడు ప్రత్యేక అధికారిని నియమించడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రత్యేక  అధికారి నియామకంపై నిషేధం విధించాలని కోరారు. దీనికి సంబంధిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరపనున్నారు.