Asianet News TeluguAsianet News Telugu

నన్ను అడ్రస్ లేకుండా వచ్చాడన్నారు-చిరంజీవి

  • తెరవెనుక దాసరి పుస్తకం ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి
  • దాసరి జీవితంపై పసుపులేటి రామారావు రాసిన తెరవెనుక దాసరి
  • దాసరి ఎందరికో ఆదర్శంగా నిలిచి ఎందరో శిష్యులను పరిశ్రమకిచ్చారన్న చిరు
teravenuka dasari book launched by chiranjeevi

151 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ర్శ‌కుడు డా.దాస‌రి నారాయ‌ణ‌రావు జీవిత చ‌రిత్ర‌ను తెర వెనుక దాస‌రి అనే పుస్త‌క రూపంలో తీసుకొచ్చారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు. ఈ పుస్తకావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. తొలి ప్ర‌తిని టి.సుబ్బ‌రామిరెడ్డి, రెండో ప్ర‌తిని కె.రాఘ‌వేంద్ర‌రావు అందుకున్నారు.

 

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ...  మనుషుల్లో మాణిక్యం అన్నా....ఈ సినీ పరిశ్రమలో తలమానికం అన్నా, సినీ కార్మికులకు అత్యంత భరోసా ఇచ్చే గుండె ధైర్యం అన్నా... ఆయన మరెవరో కాదు, ది గ్రేట్ దాసరి నారాయణ రావుగారు. ఆయన కీర్తి శేషుడే కాదు, కీర్తి విశేషుడు కూడా. ఒక దాతగా, దర్శకుడిగా, దార్శనికుడిగా ఆయన ఆర్జించినటువంటి కీర్తి విశేషమైనది. అలాంటి వ్యక్తి ఏ పని చేసినా సంచలనం. ఏ విజయం సాధించినా అది అపురూపం, అమోఘం, ఒక చరిత్ర. అలాంటి వ్యక్తి మన మధ్య లేక పోవడం ఎవరూ తీర్చలేని లోటు. కానీ ఇంత మంది గుండెల్లో ఆయన జీవించి ఉండటం అనేది ఎంతో మందికి స్పూర్తి దాయకం అన్నారు.

 

అలాంటి వ్యక్తిపై ‘తెర వెనక దాసరి' అనే పుస్తకం తీసుకువచ్చే వ్యక్తి మట్టిలో మాణిక్యం అని చెప్పాలి. ఆయన మరెవరో కాదు పసుపులేటి రామారావుగారు. పసుపులేటి రామారావుగారు నేను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఉన్నప్పటి నుండి పరిచయం. ఆరోజు ఎలా ఉన్నారో, ఈ రోజు అదే రకమైన ఆహార్యం, వ్యక్తిత్వంతో ఉన్నారు. ఏ మాత్రం మారలేదు. అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తుంటాం. అని చిరంజీవి అన్నారు.

 

ఏ అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలోకి చిరంజీవి వచ్చాడు, ఈ రోజు ఇండస్ట్రీలో ఇంతటివాడయ్యాడు అని నన్ను  ప్రశంసిస్తుంటారు. కానీ నాకు ఇన్స్‌స్పిరేషన్ దాసరిలాంటి వారు. వెనక ముందు ఎవరూ లేకుండా పాలకొల్లు నుండి ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ... ఇండస్ట్రీ మీద మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదులుకుని ఇక్కడ తన మీద, తన టాలెంట్ మీద నమ్మకంతో వచ్చారు. ఈ కళామతల్లి టాలెంట్ ఉంటే ఎవరినైనా ఆదరిస్తుంది, అక్కున చేర్చుకుంటుందనే భరోసాతో ఆయన వచ్చిన విధానం ఒక మర్రివృక్షమై, వట వృక్షమై ఈ రోజు ఇంత మంది శిష్యులను పొంది ఈ సినీ పరిశ్రమకు గొప్ప సేవలు అందించారు. ఆయన గురించి చెప్పాలంటే దాసరి గారి ముందు దాసరి తర్వాత అన్నంత బ్రిడ్జిలాగా ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈ పుస్తకంలో పొందు పరచయడం చాలా సంతోషంగా ఉంది.... అని చిరంజీవి అన్నారు.

 

ఇండస్ట్రీకి రావాలనుకునేవారికి, ఇండస్ట్రీలో చాలా సాధించేశాము అన్న ఫీలింగ్ ఉన్న మాలాంటోళ్లకు.. రాఘవేంద్రరావు గారు కానీ, మురళీమోహన్ గానీ, మా లాంటి వారు అందరికీ ఈ పుస్తకం చదివితే సాధించిందేమీ లేదు. ఇంకా చాలా ఉందంటూ చెప్పే పుస్త‌కం ఇది. దాస‌రిగారి గురించి ఎంతో విష‌యాన్ని సంగ్ర‌హించి పుస్త‌క రూపంలో తీసుకొచ్చినందుకు రామారావుగారిని అభినందిస్తున్నాను. ఈ పుస్తకావిష్క‌ర‌ణ చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

Follow Us:
Download App:
  • android
  • ios