Tanushree Dutta: సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవాళ్లను ఎలా దోచుకుంటారో నటి తనుశ్రీ దత్తా బయటపెట్టారు. పెద్ద పెద్ద ఆశలు చూపి వలలో వేసుకుంటారని, లైంగికంగా వాడుకుంటారని, కొందరిని వ్యభిచారంలోకి కూడా దించుతారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
బాలీవుడ్‌పై తను శ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తాజాగా సినిమా ఇండస్ట్రీలో కొత్తవాళ్లపై జరిగే దోపిడీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టే చాలామంది కొత్తవాళ్లు లైంగిక దోపిడీకి గురవుతున్నారని, కొందరి పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందంటే వాళ్లను బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారని ఆమె ఆరోపించారు. 'మేరీ సహేలీ' అనే మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చే చాలామంది కొత్తవాళ్లను మొదట్లో తెగ పొగిడేస్తారని, వాళ్లకు పెద్ద పెద్ద ఆశలు చూపి ఆకర్షిస్తారని తనుశ్రీ చెప్పారు. 'నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావ్, నీలో స్టార్ అయ్యే లక్షణాలున్నాయి' అంటూ పొగడ్తలతో ముంచెత్తుతారని, కానీ ఆ మాటలన్నీ ఓ పెద్ద వలకు నాంది అని తర్వాత తెలుస్తుందని ఆమె అన్నారు.
'ఇక్కడి అత్యాశ పద్ధతే వేరు' - తనుశ్రీ
తనుశ్రీ చెప్పిన దాని ప్రకారం, ఇండస్ట్రీలో చాలామంది ముందు కొత్త ఆర్టిస్టులను పొగిడి, ఆ తర్వాత వేర్వేరు వ్యక్తులను కలవమని అడుగుతారట. ఇలాంటి వాతావరణంలో ఆర్టిస్టులు చాలా జాగ్రత్తగా, ఆచితూచి అడుగులు వేయాలని ఆమె హెచ్చరించారు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తలు పెద్దయ్యాక కూడా వర్తిస్తాయని తనుశ్రీ అన్నారు. తెలియని వాళ్లతో మాట్లాడొద్దని పిల్లలకు ఎలా చెబుతామో, ఇండస్ట్రీలో కూడా అంతే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని ఆమె చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో అత్యాశ పద్ధతే వేరుగా ఉంటుందని వివరించారు. చాలామంది ఆర్టిస్టుల ఆశయాలు, ఆశలు, కలలను వాడుకుంటారని ఆమె అన్నారు. ఇండస్ట్రీకి వచ్చే కొత్తవాళ్లకు ఒక హెచ్చరికగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు.
వ్యభిచారంలోకి లాగుతారు
`ఇక్కడికి చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు వస్తారు. వాళ్లను వాడుకుని, దోచుకుని, ఆ తర్వాత వదిలేస్తారు. కొందరిని ఎంతలా దోచుకుంటారంటే, వాళ్లను వ్యభిచారంలోకి దించేస్తారు. అలా ఆ రొంపిలోకి దిగేలా చేస్తారు. కొంతమంది మానసికంగా ఎంతగా కుంగిపోతారంటే, వాళ్లు తమ సొంత ఊళ్లకు తిరిగి వెళ్లిపోతారు. కానీ ఈ కథలు ఎప్పటికీ బయటకు రావు. కేవలం సక్సెస్ స్టోరీలను మాత్రమే బయట చూపిస్తారు` అని ఆమె అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో రాజీ పడటాన్ని సమర్థించినందుకు ఒక ఫేమస్ నటితో తన స్నేహాన్ని కూడా వదులుకున్నానని తనుశ్రీ చెప్పారు. ఎవరితోనైనా వ్యక్తిగత సంబంధంలో ఉండాలనుకుంటే అది వేరే విషయం, కానీ కెరీర్ కోసం రాజీ పడే రకం తాను కాదని ఆమె తేల్చిచెప్పారు. 'అలాంటి వ్యవహారాలు నాకు సెట్ కావు, నేను ఒక ఆర్టిస్ట్‌ను' అని తనుశ్రీ అన్నారు.


