తెలుగు నిర్మాతలు ఎవరూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఆయనకు ఇకపై ఇవ్వకూడదని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీర్మానించిందని ..

మరో రెండు రోజుల్లో చిరంజీవి భోళా శంకర్ మూవీ రిలీజ్ అవుతుండగా..ఆ చిత్ర నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ లపై కోర్ట్ లో పిర్యాదు చేసారు వైజాగ్ కు చెందిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్). నిర్మాత అనీల్ సుంకర గత చిత్రం ఏజెంట్ మూవీ విషయంలో నిర్మాతలు తనను మోసం చేసారని ఆయన కోర్ట్ లో పిర్యాదు చేసాడు. అయితే కోర్టుకు ఆయన సమర్పించిన డాక్యుమెంట్స్ పోర్జరీవి అనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో దిల్ రాజు నేతృత్వంలో మీటింగైన నిర్మాతల మండలి సదరు డిస్ట్రిబ్యూటర్ పై బ్యాన్ కు నిర్ణయం తీసుకుందని సమాచారం. తెలుగు నిర్మాతలు ఎవరూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఆయనకు ఇకపై ఇవ్వకూడదని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీర్మానించిందని మీడియా వర్గాల సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన ఏదీ బయిటకు రాలేదు. ఇదే జరిగితే ఆ డిస్ట్రిబ్యూటర్ ఇక బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిందే అని వినిపిస్తోంది. మరి ఈ విషయమై వైజాగ్ సతీష్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఇక ఏజెంట్ మూవీ విషయంలో నిర్మాతలు తనను మోసం చేసారని ఆయన కోర్ట్ లో చేసిన పిర్యాదులో విషయం ఏంటంటే.. ఏప్రిల్ నెలలో విడుదలైన ‘ఏజెంట్’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీ, కర్ణాటకలకు ఐదేళ్ల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చి.. రూ. 30 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత కేవలం వైజాగ్ ఏరియా మాత్రమే ఇచ్చారు. అదేంటి అని అడిగితే డబ్బులు సెటిల్ చేస్తామని..వేరే సినిమాలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వారు చేసిన “సామజవరగమన” చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను వైజాగ్ వరకు ఇచ్చారు. ఆ చిత్రం ద్వారా కేవలం చాలా కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యాయి. 

ఈ నేపథ్యంలో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామన్నారు. ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తానని నాకు ఒప్పంద పత్రం చేశారు. అయితే వారి తదుపరి సినిమా “భోళా శంకర్” రిలీజ్ కు సిద్ధమైంది. అయితే కొద్ది రోజులుగా వారు నాకు సమాధానం ఇవ్వడం మానేశారు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు కూడా ఈ విషయం చెప్పి, సంప్రదింపులు జరిపినప్పటికీ, ఫలితం లేకపోవడంతో నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగడం కోసం తప్పనిసరి పరిస్థితులలో కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈరోజు బుధవారం సాయంత్రం కోర్టులో విషయం తేలిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడుతాం. వాస్తవాలను మీడియా ముందు ఉంచుతాం” అని సత్యనారాయణ తెలిపారు.