తెలంగాణాలో డిసంబర్ 7 శుక్రవారం నాడు ఎలెక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్, మహాకూటమిల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఈ ఎలెక్షన్స్ పై జనాలకు ఆసక్తి పెరిగిపోయింది. పాలిటిక్స్ పై అవగాహన లేనివాళ్లు సైతం ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు.

ప్రస్తుతం జనాల మూడ్ మొత్తం ఎన్నికలపైనే ఉంది. ఇలాంటి నేపధ్యంలో టాలీవుడ్ లో మూడు సినిమాలను విడుదల చేసే సాహసం చేస్తున్నారు. 'కవచం', 'సుబ్రమణ్యంపుం', 'నెక్స్ట్ ఏంటి..?' వంటి సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఏ సినిమాకైనా ఓపెనింగ్ డే చాలా కీలకం.

ఎన్నికల నేపధ్యంలో జనాలంతా ఓటింగ్ బూతుల ముందు క్యూలు కడితే సినిమాలు చూసేదెవరు..? ఇక 11న ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి ఆరోజు టీవీల ముందు నుండి కదిలే ప్రసక్తే లేదు.

ఇలా వారం మాత్రమే ఆడే సినిమాలపై అందులో రెండు రోజులు వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కానీ నిర్మాతలు మాత్రం ఎంత హడావిడి ఉన్న సాయంత్రానికి తగ్గిపోతుందని, ఫస్ట్ డే, సెకండ్ షోలు తప్పకుండా జనాలు థియేటర్ కి వస్తారని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!