సినీ నటుడు తారకరత్న భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసం నుంచి ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించారు. 

సినీ నటుడు తారకరత్న భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసం నుంచి ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించారు. ఈ రోజు ఉదయం తారకరత్న నివాసానికి చేరుకున్న బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు.. అక్కడి నుంచి ఆయన భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి‌లు తారకరత్న భౌతికకాయం వెంటే ఫిల్మ్‌ఛాంబర్‌కు చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు తారకరత్న భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచనున్నారు. 

మధ్యాహ్నం తర్వాత ఫిల్మ్‌ఛాంబర్‌ నుంచి తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తారకరత్న అంత్యక్రియలకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. 

ఇదిలా ఉంటే.. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అయితే గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు అరగంట పాటు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూనే వచ్చారు. అయితే వైద్యులు తారకరత్నను బతికించడానికి ఎంతగానో ప్రయత్నించారు. హాస్పిటల్లో చేరినప్పటి నుంచి ఆయన పరిస్థితి క్రిటికల్ గానే వుండటంతో ఐసియూలోనే ఉంచి చికిత్స అందించారు. విదేశాల నుంచి ప్రత్యేక వైద్యబృందాలను తీసుకువచ్చి మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన తారకరత్న.. నందమూరి కుటుంబసభ్యులను, సినీప్రియులను దు:ఖంలో ముంచి శనివారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

ఇక, ఆదివారం తెల్లవారుజామున తారకరత్న భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నటులు బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, రాఘవేంద్ర‌రావు, మురళీమోహన్, బోయపాటి శ్రీను, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, పలువురు టీడీపీ నేతలు.. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న సమయంలో బాలకృష్ణ కన్నీటిని ఆపుకోలేకపోయారు.

తారకరత్న మరణంతో భార్య అలేఖ్య రెడ్డి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు వారిని పరామర్శించి ఓదారుస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం అలేఖ్య కొంత అస్వస్థతకు గురయ్యారు. అలేఖ్య అస్వస్థత గురించి స్పందించిన విజయసాయిరెడ్డి.. కొంత మానసిక ఒత్తిడికి లోనవుతుందని తెలిపారు. కాళ్లు, చేతులు కొంచెం వణకడం మొదలైందని.. అయితే అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అమితంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం చిన్న విషయం కాదని.. కొంతకాలం ఒడిదుడుకులు ఉంటాయని చెప్పారు.