బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై నటి తనుశ్రీదత్తా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమానికి తెరలేపింది తనుశ్రీదత్తా. కొంతకాలంగా ఈ విషయంపై మౌనంగా ఉన్న ఆమె తాజాగా అమీర్ ఖాన్ చేసిన పని వలన మరోసారి మీడియా ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. అమీర్ ఖాన్ హీరోగా దర్శకుడు సుభాష్ కపూర్ 'మొఘల్' అనే సినిమా తీయలనుకున్నారు.

కానీ ఓ యువతి సుభాష్ పై లైంగిక ఆరోపణలు చేయడంతో అమీర్ ఖాన్ సినిమా నుండి తప్పుకున్నారు. కానీ ఆ తరువాత సుభాష్ ఎంతో బాధ పడడంతో ఆ బాధను చూసి  తట్టుకోలేక అమీర్ సినిమా చేయడానికి అంగీకరించారు.

ఈ విషయాన్ని అమీర్ ఖాన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సుభాష్ తనకు ఫోన్ చేసి ఎంతో బాధ పడుతున్నాడని.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని.. ఆయన బాధ భరించలేక సినిమా ఒప్పుకున్నానని మీడియా ముందు చెప్పారు అమీర్ ఖాన్. ఈ విషయంపై తాజాగా తనుశ్రీ స్పందించింది. మహిళలు లైంగిక వేధింపు ఎదుర్కొన్నప్పుడు బాలీవుడ్ లో ఏ ఒక్కరూ నిద్రలేని రాత్రులు ఎందుకు గడపలేదని ప్రశ్నించింది.

సుభాష్ కోసం సినిమా ఒప్పుకున్న అమీర్.. సుభాష్ కారణంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతిని మాత్రం సినిమాలో ఎందుకు తీసుకోలేదని అడిగింది. బాలీవుడ్ లో ఉన్న వెధవలకు మాత్రమే ఎందుకు సానుభూతి లభించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. నానా పటేకర్ కారణంగా పదేళ్ల క్రితం తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నప్పుడు తన కెరీర్ నాశనమైందని.. అప్పుడు తన గురించి ఎవరూ ఎందుకు ఆలోచించలేదనిప్రశ్నించింది. 'నా కెరీర్ గురించి మీరెందుకు ఆలోచించలేదు అమీర్' అంటూ నేరుగా అతడినే ప్రశ్నించింది.