హీరోయిన్ తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం గత ఏడాది భారత చలనచిత్ర రంగంలో ప్రకంపనలు రేపింది. బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ పై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. తనుశ్రీ నుంచి ప్రేరణ పొందిన ఇతర నటీమణులు తమకు జరిగిన లైంగిక వేధింపులని ధైర్యంగా బయట పెట్టారు.  

అదే సమయంలో మీటూపై విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. కొందరు మీటూ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తూ బెదిరింపులు ఎదురవుతున్నాయనే వాదన కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం నేహా కక్కర్ జడ్జ్ గా వ్యవహరించిన ఓ షో వివాదంగా మారింది. 

ఆ షోలో నేహా కక్కర్ ని ప్రముఖ సింగర్ ఒకరు స్టేజిపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నారు. ఆ సమయంలో నేహా కక్కర్ కూడా అతడి చర్యకు ఆశ్చర్యపోయింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ వీడియో మాత్రం సామజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. 

సదరు సింగర్ నేహా కక్కర్ పై అభిమానంతో అలా చేశాడు. దీనిపై తాజాగా తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. నేహా కక్కర్ మీటూ ఉద్యమంలో పాల్గొని అతడిపై కేసు నమోదు చేయాలని తనుశ్రీ దత్త పిలుపునిచ్చింది. 

అభిమానంతో ముద్దు పెట్టుకున్నా కూడా తప్పేనా అని నెటిజన్లు తనుశ్రీని ప్రశ్నిస్తున్నారు. నేహా కక్కర్ కూడా ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది. ఇప్పుడెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు అంటూ తనుశ్రీకి చురకలు అంటిస్తునారు. ప్రతి చిన్న విషయాన్ని మీటూ అంటూ ఆ ఉద్యమానికి ఉన్న గౌరవం తగ్గించవద్దు అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.