నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు బాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. తనుశ్రీ చేసిన ఆరోపణలపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు స్పందించారు. చాలా మంది ఆమెకి మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్నారు.

2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో తనుశ్రీతో నానాపటేకర్ తప్పుగా ప్రవర్తించారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అతడికి వ్యక్తిరేకంగా మాట్లాడడంతో తను ప్రయాణించే కారుపై మనుషులతో దాడి చేశారని తనుశ్రీ చేసిన ఆరోపణలు నిజమేనని నిరూపిస్తూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా చక్కర్లు కొడుతోంది.

ఈ విషయంపై స్పందించిన నానాపటేకర్ ఆమెపై లీగల్ గా యాక్షన్ తీసుకోనున్నట్లు వెల్లడించారు. నానాపటేకర్ న్యాయవాది తనుశ్రీ చేసే ఆరోపణలు అసత్యమైవని, క్షమాపణలు చెప్పాలని ఆమెకి నోటీసులు పంపామని మీడియాకి వెల్లడించారు. తనుశ్రీ మాత్రం తనకు నానాపటేకర్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.

ఈ నోటీసులు, బెదిరింపులు తనలాంటి బాధితులను బయటకి రానివ్వకుండా చేయడానికేనని అన్నారు. ఎవరికైనా తనలాంటి అనుభవమే ఎదురైతే బయటకొచ్చి  పోరాడాలని  పిలుపునిచ్చారు.