బిగ్ బాస్ షో లో తన కోపంతో యాంగ్రీ బర్డ్ అని పేరు తెచ్చుకున్న తనీష్ బయటకొచ్చిన తరువాత తన సినిమాలతో బిజీ అయిపోయాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన 'రంగు' సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తనీష్ 'లారా' అనే రౌడీ షీటర్ గా కనిపించనున్నాడు. 

విజయవాడలో పవన్ కుమార్ అనే వ్యక్తి లారా అనే పేరుతో రౌడీషీటర్ గా మారాడు. అతడి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాపై ఇప్పుడు వివాదం నెలకొంది. లారా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ సినిమా విడుదల కానువ్వమని అంటున్నారు. ఈ మేరకు ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ని నిర్వహించి ఈ సినిమాపై ఫైర్ అయ్యారు. 

లారా కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ''ఏడాది క్రితం లారా(పవన్ కుమార్) గురించి సమాచారం సేకరించడానికి చిత్ర దర్శకుడు కార్తికేయ వచ్చాడు. అప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ చూశాం. లారాని చంపెయ్యాలి అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. లారాపై అన్యాయంగా రౌడీషీటర్ అనే ముద్ర వేశారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదువుకుంటున్నారు.

ఈ సినిమా రిలీజ్ అయితే వారిపై ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ విషయాన్ని డైరెక్టర్ కి చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఆయన స్పందించడం లేదు. సినిమాని 
మాకు చూపించి అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వాటిని తొలగించాలి. లేదంటే ఈ సినిమా రిలీజ్ కాకుండా ఎంతవరకైనా వెళ్తాం'' అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాపై తనీష్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అతడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఈ సినిమా టీజర్ ని ప్లే చేశారు బిగ్ బాస్. మరి ఈ వివాదం నుండి ఎలా బయటపడతారో చూడాలి!