సూపర్‌స్టార్ కృష్ణకు నివాళులర్పించారు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి. కృష్ణ అంటే ఒక ప్రయోగశాల అని ఆయన ప్రయోగశీలి అని తనికెళ్ల భరణి ప్రశంసించారు.

తాను చిన్నప్పటీ నుంచి కృష్ణగారి అభిమానిని అన్నారు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి. నానక్‌రామ్‌గూడలో కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించిన అనంతరం భరణి మీడియాతో మాట్లాడుతూ.. అభిమాన నటుడితో కలిసే నటించే అవకాశం తనకు దక్కిందన్నారు. ఈ విషయం కృష్ణకు కూడా చెప్పానని భరణి తెలిపారు. తన సినిమా అయినా సరే ఫ్లాప్ అయితే ఫ్లాప్ అనే చెప్పేవారని.. కృష్ణ అంటే ఒక ప్రయోగశాల అని ఆయన ప్రయోగశీలి అని తనికెళ్ల భరణి ప్రశంసించారు. తాను ఎదుగుతూ చలన చిత్ర పరిశ్రమ ఉన్నతికి తోడ్పాడ్డారని.. కృష్ణది ఒక విశ్వరూపమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని తనికెళ్ల భరణి భగవంతుడిని ప్రార్ధించారు. 

కాగా.. తెలుగు తెర దిగ్గజం, సూపర్‌ స్టార్‌ కృష్ణ మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. లెజెండరీ నటుడు కన్నుమూయడంతో టాలీవుడ్‌ శోకసంద్రంలో మునిగిపోయింది. కేవలం తెలుగు సినీ ప్రముఖులే కాదు, ఇండియన్‌ సినిమాకి చెందిన ప్రముఖులు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌కిది ఓ చీకటి రోజుగా వర్ణిస్తున్న నేపథ్యంలో కృష్ణకి సంతాప సూచకంగా తెలుగు నిర్మాతల మండలి ఓ నిర్ణయంతీసుకుంది. రేపు షూటింగ్‌లు బంద్‌కి పిలుపునిచ్చింది.

Also REad:ముగిసిన తొలితరం స్టార్స్ శకం..!

అటు .. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించింది. రేపే కృష్ణగారి అంత్యక్రియలు చేయనున్న నేపథ్యంలో రేపే షూటింగ్‌లకు బంద్‌కి పిలుపునిస్తూ తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్‌, మోహన్‌ వడ్లపట్ల అధికారికంగా ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. మరోవైపు ఏపీలోనూ రేపు మార్నింగ్‌ షోలను రద్దు చేస్తూ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవడం విశేషం.