ముగిసిన తొలితరం స్టార్స్ శకం..!
కృష్ణ మరణంతో తొలితరం సూపర్ స్టార్స్ శకం ముగిసింది. ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏఎన్నార్, కృష్ణంరాజు, కృష్ణ వినీలాకాశ వెండితెరపై ఆడిపాడేందుకు పుడమిని వదలిపోయారు. సినిమాల రూపంలో తమ జ్ఞాపకాలను తెలుగు ప్రేక్షకులకు విడిచి వెళ్లారు.

Super Star Krishna
తెలుగు సినిమాకు హీరోయిజం పరిచయం చేసిన హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్. వీరిద్దరి స్పూర్తితో నటులుగా మారినవారు, హీరోలుగా ఎదిగినవారు ఎందరో. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో కృష్ణ. తర్వాత శోభన్ బాబు, కృష్ణంరాజు ఫ్యాన్ ఫాలోయింగ్ తో స్టార్స్ అయ్యారు. ఈ ఐదుగురు టాలీవుడ్ తొలితరం స్టార్స్ గా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు చేశారు.
వెండితెర ఇలవేల్పుగా కొలవబడ్డారు ఎన్టీఆర్. తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసి సీఎం పీఠం అధిరోహించారు. కథానాయకుడిగా ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో ఉండిపోయారు. 1996 జనవరి 18న గుండెపోటుతో మరణించారు.
ఫ్యామిలీ చిత్రాల హీరోగా లవర్ బాయ్ ఇమేజ్ తో శోభన్ బాబు భారీ విజయాలు అందుకున్నారు. అందానికి శోభన్ బాబును చిరునామాగా చెప్పుకునేవారు. శోభన్ బాబు 2008 మార్చ్ 20న చెన్నైలో మరణించారు. అత్యంత క్రమశిక్షణ కలిగిన నటుడిగా శోభన్ బాబు పేరు తెచ్చుకున్నారు.
ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదిగితే ఏఎన్నార్ రొమాంటిక్ హీరోగా తనదైన ముద్ర వేశారు. ఏఎన్నార్-ఎన్టీఆర్ మధ్య గట్టి పోటీ నడిచింది. కృష్ణ వచ్చే వరకు బాక్సాఫీస్ వార్ వీరిద్దరి మధ్యే. 2014 జనవరి 22న ఏఎన్నార్ 90ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు.
కృష్ణం రాజు 1974లో 17 సినిమాలను రిలీజ్ చేశారు
రెబల్ స్టార్ కృష్ణంరాజు మాస్ అండ్ పవర్ ఫుల్ రోల్స్ కి పెట్టింది పేరు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ స్టార్స్ గా వెలిగిపోతున్న రోజుల్లో తనకంటూ ఒక ఇమేజ్, మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు రాజకీయనాయకుడిగా కూడా రాణించిన కృష్ణంరాజు ఈ ఏడాది సెప్టెంబర్ 11న అనారోగ్యంతో మరణించారు.
తొలితరం స్టార్స్ లో జీవించి ఉన్న ఆ ఒక్కరు కృష్ణ కూడా కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చేరిన కృష్ణ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి గురయ్యారు. ఎంత ప్రయత్నం చేసినా ఆయన్ని వైద్యులు కాపాడలేకపోయారు. ఫస్ట్ ఇండియన్ కౌ బాయ్, జేమ్స్ బాండ్ సుదూర తీరాలకు వెళ్లిపోయారు. నవంబర్ 15 ఉదయం కృష్ణ కన్నుమూశారు.