'మహానటి' సావిత్రి బయోపిక్ కాదు!

'మహానటి' సావిత్రి బయోపిక్ కాదు!

దర్శకుడు నాగ్అశ్విన్.. సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యి ఘన విజయాన్ని సాధించింది. అయితే కొందరు సీనియర్ తారలు ఈ బయోపిక్ లో నిజాలు చూపించలేదని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అసలు ఇది సావిత్రి బాయోపిక్ కాదని ఇదో కల్పిత కథ అని అందరికీ షాక్ ఇచ్చాడు. 

''మహానటి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగిందని చెబుతుంటే సంతోషంగా అనిపిస్తుంది. దర్శకుడు నాగ్అశ్విన్ మంచి సినిమా తీశారని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే 'మహానటి'లో జెమినీ గణేశన్ ను నెగెటివ్ గా చూపించారంటూ వారి పిల్లలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఈ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రను బాగా ఎలివేట్ చేశారు. సావిత్రి గారు నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఆమె గురించి తెలిసిన వాళ్లంతా కూడా ఆమె జీవితంలో విలన్ అంటే జెమినీ అనే అనుకునేవాళ్లం. 
నిజం చెప్పాలంటే.. 'మహానటి' సినిమా చూస్తున్నప్పుడు చాలా బాధ పడ్డాను. జెమినీ గణేశన్ వలనే సావిత్రి హీరోయిన్ అయినట్లు ఆయన్ను చాలా మంచిగా చూపించారు. అలా చూపించకుండా ఉండాల్సింది. కానీ నాగ్అశ్విన్ ఆలోచనలు వేరు. సావిత్రి చనిపోయిన తరువాత ఆయన పుట్టారు. ఆయనకు తెలిసిన విషయాలను కొంత సమాచారం మేరకు దాని చుట్టూ కథ అల్లుకొని సినిమా చేశారు. అది నిజమైన బయోపిక్ అనుకొని మీరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు.. అది సావిత్రి బయోపిక్ కాదు. ఒకప్పుడు జెమినీ గారి కుమార్తెలు అందరూ కలిసి ఫోటోలు దిగితే చాలా ముచ్చటగా అనిపించేది. ఇప్పుడు మీరే గొడవ పడటం మంచిది కాదు'' అంటూ జెమినీ, సావిత్రి కూతుళ్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page