రాజకీయ విమర్శల సెగలు టీవీ షోలకు తగిలాయి. తమిళనాట రాజకీయ అస్త్రాలు ఓ షోని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆ టీవీ యాజమాన్యం తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. తమిళనాడులో కమల్‌ హాసన్‌ నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగానూ రాణిస్తున్నారు. ఆయన ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. తమిళనాడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. 

ఈ క్రమంలో తమిళనాడు సీఎం పళనిస్వామికి, కమల్‌ హాసన్‌కి మధ్య రాజకీయ విమర్శలు ఇప్పుడు కమల్‌ హోస్ట్ గా నిర్వహించే `బిగ్‌బాస్‌`కి తగిలాయి. తమిళనాడు సీఎం కె.పళనిస్వామి.. `బిగ్‌బాస్‌`ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఐటీ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో లెక్కలోకి రాని డబ్బులు భారీగా సీజ్‌ చేశారు. దీనిపై కమల్‌ హాసన్‌ పార్టీ ప్రతినిధులు స్పందిస్తూ, పళనిస్వామి ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తుందని, అందుకు ఐటీ దాడుల్లో బయటపడ్డ మనీనే ఉదాహరణ అంటూ విమర్శలు గుప్పించారు. 

దీనిపై సీఎం పళనిస్వామి మాట్లాడుతూ, కమల్‌ హాసన్‌ డెబ్బై ఏళ్ల వయసులో బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? బిగ్‌బాస్‌ షో చూడటం వల్ల పిల్లలు చెడిపోతున్నారు. ఇలాంటి షోస్‌ని హోస్ట్ చేయడం వల్ల ఫ్యామిలీస్‌ ఏం బాగుపడవు` అని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతేకాదు బిగ్‌బాస్‌పై కొత్త చర్చ మొదలైంది. దీన్ని నిర్వహించే యాజమాన్యం ఇబ్బందుల్లో పడే పరిస్థితి నెలకొంది.