ఉదయ నిధి స్టాలిన్, కీర్తిసురేష్, ఫహద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రలో నటించిన `మామన్నన్` చిత్రం తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తెలుగులో రాబోతుంది.
ఎమ్మెల్యే, తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్.. ఇంటీవల `మామన్నన్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ కథానాయికగా నటించగా, `పుష్ప` ఫేమ్ ఫహద్ ఫాజిల్, వడివేలు ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 29న విడుదలైన ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దాదాపు యాభై కోట్లు వసూలు చేసింది. ఇంకా విజయవంతంగా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఇటీవల విజయం సాధించిన చిత్రాలను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా సక్సెస్ అవుతున్నాయి. `కాంతార`, `2018` వంటి చిత్రాలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటిదే `మామన్నన్`. ఈ సినిమాని తెలుగులో `నాయకుడు`గా రిలీజ్ చేయబోతున్నారు. ఏషియన్ మల్లీఫ్లెక్స్ ప్రై లి, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాని తెలుగులో `నాయకుడు`గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 14న దీన్ని రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ఇక్కడ కూడా ఆసక్తి ఏర్పడింది.
అయితే ఆ మధ్య తమిళంలో పెద్ద హిట్ అయిన `విడుదలై 1` చిత్రం తెలుగులో అంతగా ఆదరణ పొందలేదు. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందోచూడాలి. ఇదిలా ఉంటే అదే రోజు తెలుగులో ఆనంద్ దేవరకొండ `బేబీ`తోపాటు అశ్విన్ నటించిన `హిడింబ` చిత్రాలున్నాయి. దీంతో `నాయకుడు` వాటికి పోటీగా మారబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కంటెంట్ బాగున్న సినిమాలు ఎన్ని సినిమాల మధ్యలోనైనా ఆడతాయి. విజయం సాధిస్తాయి. కంటెంట్ లేకపోతే సింగిల్‌గా వచ్చిన ఆడదు.
ఇక `మామన్నన్` సినిమా విషయానికి వస్తే ఇది యాక్షన్ థ్రిల్లర్. ఓ దళిత ఎమ్మెల్యే ఆయన కొడుకు కథతో ఈ సినిమా సాగుతుండటం విశేషం. చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో ఎప్పుడూ కామెడీతో అలరించే వడివేలు ఇందులో సీరియస్ రోల్ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా, సీఎంగా కనిపిస్తారు. సీరియస్ పాత్రలోనూ అద్భుతంగా చేసి సినిమాకి ప్రాణం పోశారు. ఫహద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలి ఇలా అంతా ఎంతో బాగా నటించి మెప్పించారు. సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.
