కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. తమిళంలో ఆయన లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఉండేవి కాదు. ఒకానొక సమయంలో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకున్న దాఖలాలు ఉన్నాయి. అటువంటి నటుడు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యనే రీఎంట్రీ ఇచ్చారు.

లారెన్స్ నటించిన 'శివలింగ' సినిమాలో వడివేలు కనిపించారు. ఇది ఇలా ఉండగా.. గతంలో వడివేలు శింబు దేవన్ దర్శకత్వంలో 'హింసించే రాజు 23వ పులికేసి' అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో వడివేలుకి మంచి క్రేజ్ దక్కింది.ఆ తరువాత కూడా ఆయన ప్రధాన పాత్రలో చాలా సినిమాలు వచ్చాయి.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశారు శింబు దేవన్. ఈ క్రమంలో హీరోగా వడివేలుని ఒప్పించి ఆయనకి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. సినిమా షూటింగ్ కోసం సెట్ కూడా వేశారు. కానీ వడివేలు మాత్రం ఆ సినిమా షూటింగ్ వెళ్లకుండా నో చెప్పారట. దీంతో నిర్మాతలు భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఈ చిత్ర నిర్మాత శంకర్.. నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కౌన్సిల్ ఆయనకు నష్టపరిహారం కింద రూ.9 కోట్లు చెల్లించమని సూచించింది. ఆ మాటల్ని కూడా వడివేలు లెక్క చేయకపోవడంతో ఆయనపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడితో సినిమాలు చేయకూడదని దర్శకనిర్మాతలకు నోటీసులు కూడా పంపించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై స్టార్ కమెడియన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!