లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజులుగా కరోనతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న తాను కరోన బారిన పడినట్టుగా స్వయంగ ప్రకటించిన ఎస్పీ, అప్పటి నుంచి ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం విషమించటంతో ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడకపోవటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో కోలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలు ఎస్పీ త్వరగా కోలుకోవాలంటూ సామూహిక ప్రార్థనలకు పిలుపునిచ్చారు. కోలీవుడ్ హీరోలు రజనీకాంత్, కమల్‌ హాసన్, దర్శకుడు భారతీ రాజా, సంగీత దర్శకుడు ఇళయరాజా, ఏఆర్‌ రెహహాన్, రచయిత వైరముత్తూలు సంయుక్తంగా ఓప్రకటనను విడుదల చేశారు.

ఈ ప్రకటనలో `ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వారికి, సంగీత ప్రియులకు ఓ విన్నపం. గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఆగస్టు 20 సాయంత్రం 6 గంటలకు సామూహిక ప్రార్థనలు చేద్దాం. ఎవరికి వారు తమ ఇంట్లోనే ఉండి ఎస్పీ పాటలను ప్లే చేయండి. ఆయన గొంతు మనం మళ్లీ వినేలా చేసుకోవాలి` అంటూ తమ సందేశాన్ని విడుదల చేశారు.

దర్శకుడు భారతీ రాజ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. `బాలుని రక్షించాలని ప్రకృతిని అర్ధించబోతున్నాం. తమిళ సినీ పరిశ్రమకు చెందిన కళాకారులు, కార్మికులు అంతా 20న సాయంత్రం 6 గంటలకు నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. ఎస్సీ కళాకారుల్లో ఎంతో సంస్కారం ఉన్నవాడు. ప్రేమని మాత్రం పంచటం తెలిసిన వాడు. అలాంటి మంచి వాడిని మనం కాపాడుకోవాలి` అంటూ ఆయన తన సందేశాన్ని వినిపించారు.