Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కే.వి. ఆనంద్‌ గుండెపోటుతో మృతి

ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కే.వి ఆనంద్‌(54) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 

tamil director and cinematographer k v anand passes away with cardiac arrest  arj
Author
Hyderabad, First Published Apr 30, 2021, 8:48 AM IST

ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కే.వి ఆనంద్‌(54) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, నటుడిగా విలక్షణ సినిమాలకు పనిచేసిన కే.వి ఆనంద్‌ మరణం తమిళ చిత్ర పరిశ్రమనే కాదు, యావత్‌ దేశాన్ని షాక్‌కి గురి చేసింది. ఆయన తన సినిమాలతో అంతటి గుర్తింపుని తెచ్చుకున్నారు. రజనీ కాంత్‌ `శివాజీ`, అర్జున్‌ `ఒకే ఒక్కడు`,  `ప్రేమదేశం`, `బాయ్స్`, `భగత్‌ సింగ్‌`, `ఖాకీ` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.  తెలుగులో ఆయన `పుణ్యభూమి నాదేశం` చిత్రానికి పనిచేశారు.

అంతేకాదు దర్శకుడిగానూ తన ప్రతిభని చాటుకున్నారు. `కణా కండేన్‌` సినిమాతో దర్శకుడిగా మారారు. సూర్యతో `అయాన్‌(తెలుగులో వీడొక్కడే)తో విజయాన్ని అందుకున్నారు. దర్శకుడిగా తన ప్రత్యేకతని చాటుకుని ప్రశంసలందుకున్నారు. ఆనంద్‌ జీవాతో రూపొందించిన `రంగం`(కో) సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ సూపర్‌ హిట్‌గా నిలిచింది.  సూర్యతో `బ్ర‌ద‌ర్స్`‌(మాట్రాన్‌), ధనుష్‌తో `అనేకుడు`(అనేగ‌న్‌), `కవ‌న్‌`, ఇటీవల చివరగా ఆయన సూర్యతో `బందోబ‌స్త్‌`(కాప్పాన్‌) చిత్రాల‌ను తెర‌కెక్కించారు.  నటుడిగా `శివాజీ`, `బ్రదర్స్`, `కావన్‌` చిత్రాల్లో నటించారు. 

మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన `థెన్మవిన్‌ కొంబాత్‌` చిత్రానికిగానూ 1994లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా జాతీయ అవార్డుని అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడం విశేషం. `శివాజీ`కి ఫిల్మ్ ఫేర్‌ అవార్డు దక్కింది. చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. `క‌ల్కి`, `ఇండియా టుడే దిన ప‌త్రిక‌ల్లో ప‌నిచేశారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ వద్ద సినిమాటోగ్రఫీలో శిష్యరికం చేశారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారారు. కే.వి ఆనంద్‌ హఠాన్మరణంపై చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios